21, జులై 2025, సోమవారం

అక్షర యోధుడు దాశరథి – తెలంగాణ రత్నానికి శతజయంతి నివాళి

"నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ తెలంగాణ ఘన కీర్తిని దశదిశలా చాటిన కవి దాశరథి కృష్ణమాచార్య. "ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని" అంటూ తన ధిక్కార స్వరంతో నిజాం ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టిన మహామహుడు దాశరథి. "ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలం ఎంతో" అంటూ తన భావోద్వేగాల్ని యావత్ ప్రపంచానికి పంచిపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్ట చివరి ఆస్థాన కవి మన దాశరథి. అటువంటి మహాకవి శతజయంతి ఉత్సవాల సందర్భంగా మనం అతడి జీవిత విశేషాలను గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత, కర్తవ్యం కూడా... ఆ చిన్న ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో.

దాశరథిగా పేరుగాంచిన దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించారు. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషన్, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఎ చదివారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నారు.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలంలోనే, తెలంగాణలో కూడా నిజాం వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది.1947లో భారతావనికి స్వాతంత్ర్యం సిద్దించింది. కాని తెలంగాణకు మాత్రం నిజాం నవాబుల పాలన నుంచి విముక్తి లభించలేదు. నిజాం పాలనలో ప్రజలు దుర్భర జీవితాలను గడిపే వారు. నిజాం నిరంకుశ పరిపాలనలో ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛఉండేది కాదు. ప్రజలు తమ మనసులోని కోరికలను తెలుపుకొనుటకు గాని, సభలు ఏర్పాటుచేసి తమ కష్టాలను, బాధలను చెప్పుకోవడానికి వీలుండేది కాదు. ప్రజలపై అధికపన్నులు విధించడం, వారి భూములను లాక్కోవడం, వంటి అరాచకాలు చేస్తూ వారిని నానా రకాలుగా బాధించే వారు. రజాకార్లు ప్రజల పాలిట నరభక్షకుల్లా తయారయ్యారు. వీరు ఇండ్లపై పడి ప్రజల్ని ఊచకోతకోసేవారు. ఆడవారిని ఎత్తుకెల్లి మానభంగం చేసెవారు.

ఈ విధంగా తెలంగాణ ప్రజలు నిజాం నవాబుల పరిపాలనలో స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లేకుండా జీవచ్చవాల్లా బ్రతికేవారు. ఇలా వీరి మతోన్మాద, కిరాతక, నియంతృత్వ, నిరంకుశ పాలనను ఎదిరించి నిజాం నవాబుకు సింహస్వప్నమై నిలిచాడు మన దాశరథి కృష్ణమాచార్య.

ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. అక్కడ పళ్ళు తోముకోవడానికి ఇచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి నిజాం ప్రభుత్వ ఆరాచకాలను ఎండగట్టాడు... అలా రాసినందుకు అక్కడి పోలీసులచే దెబ్బలు తిన్నాడు. ఈయన భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకరుగా కూడా పనిచేశారు. 1953 లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్టచివరి ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. అనేక రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు కూడా గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.

దాశరథి కవిత్వం అభ్యుదయ భావాలతో, ప్రజలను చైతన్య వంతం చేసేదిగా ఉంటుంది. వీరు సుమారు 30కి పైగా కవితా సంపుటాలను వెలువరిచారు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, కవితాపుష్పకం. తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు వంటి గొప్ప రచనలు చేశారు. వీటితోపాటు గాలీబ్ గీతాలను ఉర్దూనుంచి అనువదించారు. యాత్రాస్మృతి వంటి రచనలూ చేశారు. పద్యం, గేయం, పాట, వచనం ఇలా అన్ని ప్రక్రియలలో రచనలు చేశాడు. దాశరధి కృష్ణమాచార్య కేవలం సాహిత్యానికి సంబంధించిన రచనలే చేయలేదు. సినిమాలకు కూడా అమూల్యమైన పాటలు ఎన్నో రాశారు. వాటిలో భక్తి, శృంగారం కు సంబంధించిన గీతాలు ఎన్నో ఉన్నాయి. సుమారు 600లకు పైగా సినిమాలకు పాటలు రాశారు. పేరుకోసం ప్రయత్నించని కవి కావడం చేత వీరికి సినీ పరిశ్రమలో రావల్సినంత పేరు రాలేదని విమర్శకులు చెప్తారు.

రంగుల రాట్నం చిత్రంలో నడిరేయి ఏ జాములో స్వామి నినుజేర దిగివచ్చునో... అని భక్తుని ఆర్తిని దేవునితో విన్నివించాడు. బుద్ధిమంతుడు చిత్రంలో ననుపాలింపగ నడిచి వచ్చితివా అంటూ భక్తుడితో, దేవుణ్ని ఆరాధింప జేశాడు. ఇక శృంగారానికి సంబంధించిన పాటల విషయానికి వస్తే- ఆత్మీయులు చిత్రంలో చిలిపి నవ్వుల నినుచూడగానే, గూడుపుఠాణి చిత్రంలో తనివి తీరలేదే నా మనసు నిండలేదే అని ప్రేమలోని ఆనందాన్ని ప్రేమికుల ద్వారా వ్యక్తం చేశాడు.

దాశరథికి ఉర్దూ భాషపై పట్టు ఉండడం వల్ల ఆ భాషలోని మాధుర్యాన్ని, ఆ భాషా పదాలను పాటల్లో అద్భుతంగా ప్రయోగించేవారు. పునర్జన్మ చిత్రంలో దీపాలు వెలిగె పరదాలు తొలిగె, నవరాత్రి చిత్రంలో నిషాలేని నాడు హుషారేమిలేదు, ఖుషీ లేనినాడు మజా ఏమీలేదు... లాంటి పాటల్లో వారి ఉర్దూ ప్రతిభ కనిపిస్తుంది. అలానే ఆత్మీయులు చిత్రంలో మదిలో వీణలు మ్రోగె, ఆశలెన్నో చెలరేగె వంటి పాటలు ప్రసిద్ధిపొందాయి. ఇప్పటికీ వీరు రాసిన తోటరాముడు చిత్రంలోని ఓ బంగరు రంగుల చిలకా పలుకవే పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. అలానే కన్నె వయసు చిత్రంలో ఏ దివిలో విరిసిన పారిజాతమో పాట అమ్మాయి అందాన్ని వర్ణించే విధానానికి ఓ మూలవిరాట్ లా మిగిలే ఉంటుంది. ఇక మూగ మనసులు చిత్రంలో పల్లెటూరి యువతి మనసును చెప్తూ- గోదారి గట్టుంది గట్టుమీద సెట్టుంది... అంటూ చివరకు అంతదొరకని నిండుగుండెలో ఎంత తోడితే అంతుంది అంటూ పాటను ముగిస్తాడు దాశరథి.

"తెలంగాణమున గడ్డిపోచయున్ సంధించెన్ కృపాణమ్మున" అని తెలంగాణ తల్లి గొప్పతనాన్ని తన అక్షరాలలో అల్లుకుపోయాడు దాశరథి. అనగా తెలంగాణలో ఉన్న ప్రతీ గడ్డిపోచ కూడా ఒక పదునైన కత్తి లాగా కనిపిస్తుంది అని అర్థం... ఈ విధంగా సాగిన దాశరథి గారి భావ ప్రసార జీవిత గాథ 1987 నవంబరు 5 వరకు కొనసాగింది... దాశరథి భౌతికంగా మన ముందు లేకపోయినా తన కవిత్వం, పాటల రూపంలో ఇంకా మన మధ్యే ఉన్నాడనేది అక్షరాలా నిజం...! ఆయన శత జయంతి సందర్భంగా ఇదే మా అక్షర నీరాజనం...!


అక్షర యోధుడు దాశరథి – తెలంగాణ రత్నానికి శతజయంతి నివాళి

"నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ తెలంగాణ ఘన కీర్తిని దశదిశలా చాటిన కవి దాశరథి కృష్ణమాచార్య. "ఓ నిజాము పిశాచమా కాన...