7, జూన్ 2023, బుధవారం

గురజాడ కథా మంజరి - ఆదర్శ గృహిణి "మెటిల్డా"

ఆదర్శ గృహిణి "మెటిల్డా" 

గురజాడ రచనల్లో ప్రధాన వస్తువు స్త్రీ చైతన్యం. ఒక సంఘ సంస్కర్తగా సమాజాన్ని ఏ విధంగా సంస్కరించాలో అనేక కథల ద్వారా ఎలుగెత్తి చాటారు... వాటిల్లో ఒకటే 'మెటిల్డా'. గురజాడ తన బహుముఖ ప్రజ్ఞ ద్వారా ఈ కథలో సృష్టించిన పాత్రలు ఆరు. కానీ ఇందులోని రెండు పాత్రలకు మాత్రమే పేర్లు పెట్టారు. అవి: మెటిల్డా - ఈ కథలో కథానాయిక, రామారావు - కథ చెప్పేవాడి స్నేహితుడు. కథ చెప్పేవాడికి, మెటిల్డా భర్తకు, భర్త తండ్రికీ, ఇంటి వంట వాడికి పేర్లు పెట్టలేదు. ఇందులో కథ చెప్పేవాడు, మెటిల్డా, మెటిల్డా భర్త, రామారావు ప్రధానమైన పాత్రలు.

మెటిల్డా ఒక అందమైన, ఆదర్శ భావాలు కలిగిన, సంస్కృతీ సంప్రదాయాలు తెలిసిన గృహిణి. ఈమె 55 సంవత్సరాలు కలిగిన ఒక ముసలి భర్తతో జీవనం గడుపుతూ ఉంటుంది. భర్త కొట్టినా తిట్టినా చివరకు అవమానించినా, భర్తను సైతం చక్కదిద్ది భర్తతోనే తన జీవితమని జీవనం సాగించే ఆదర్శ మహిళగా ఎంతో మంది స్త్రీమూర్తులకు దిశా నిర్దేశం చేస్తుంది మెటిల్డా. వీళ్ళ ఇంటికి సమీపంలో ఉన్న కాలేజి యువకులతో మెటిల్డాకి సమస్య మొదలౌతుంది. వారు మెటిల్డా ముసలి భర్తను ముసలి పులి అని పిలుస్తుంటారు. ఆ కాలేజీ యువకుల్లో ఒకడు ప్రతిరోజూ మెటిల్డాను చూస్తూ ఉంటాడు. ఈ యువకుడే ఈ కథను తన స్నేహితుడైన రామారావు అనే పాత్రతో చెబుతుంటాడు.  ఈ ఉదంతాన్ని గమనించిన మెటిల్డా  భర్త ఆ యువకులను ఇంటికి పిలిచి కోపంతో మెటిల్డాను ఎన్ని సార్లు చూస్తావో చూడమని విరుచుకుపడతాడు. 



మరొకసారి మెటిల్డాను చూడకూడదని గట్టి నిర్ణయం తెసుకొని ఇంటిని చేరుతాడు ఆ యువకుడు. మెటిల్డా తన వంట మనిషి సహాయంతో "మీరు మీ నేస్తాలు నా కాపురాన్ని పాడుచేయాలనుకుంటున్నారా? మీకు నేను ఏం అపకారం చేశాను? తల వంచుకొని మీ దారిలో మీరు పోతే సరి" అని లేఖ రాసి పంపిస్తుంది. ఇది చదివిన ఆ యువకుడు పశ్చాత్తాపం చెంది స్నేహితుడు రామారావుతో నువ్వొద్దన్నా నేను మెటిల్డాను చూడటం మానలేదు.. ఇప్పుడు మెటిల్డాను రక్షించడానికి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఏమైనా సహాయం చేయమని వేడుకుంటాడు. ఈ సందర్భంలో కవి రామారావుతో రెండు మంచి మాటలు పలికిస్తాడు.

1. ఆలు మొగుళ్ళ దెబ్బలాటల్లోకి వెళ్లవద్దని మన పెద్దల శాసనం, అవి అబేధ్యాలు, ఆగమ్య గోచరాలు. మధ్యవర్తులు కాపరం చక్కచేదావని చెక్కలు చేసి వెళ్ళిపోయి వస్తారు.

2. చెడ్డ తలంపు చెప్పిరాదు. ఎక్కణ్ణించో రానక్కర్లేదు. కంటికి కనబడకుండా మనసులో ప్రవేశించి పొంచి ఉంటుంది. 

అని ఆ యువకుడికి రామారావు బుద్ధి చెబుతాడు. వీరిలో వచ్చిన మార్పును గమనించిన మెటిల్డా భర్త తన తప్పును తెలుసుకొని భార్యను అవమానించడం మానుకుంటాడు. ఎంత మంది యువకులు మెటిల్డా వైపు చూసినా ఆమె వారి పట్ల ఆకర్షితురాలు కాకపోవడంలో మెటిల్డా మంచితనాన్ని గుర్తిస్తాడు. చివరకు ఆ యువకులను ఇంటికి పిలిపించి మెటిల్డా చే కాఫీ ఇప్పిస్తాడు. వారి వల్లే తనకు తన భార్య పట్ల గౌరవం పెరిగిందని, ఆ నాటి నుండి మెటిల్డా స్వేచ్ఛకు భంగం కలిగించనని గట్టి నిర్ణయం తీసుకుంటాడు.

కుటుంబ జీవితంలో భర్తకు సగభాగం భార్య కాబట్టి భార్యా భర్తలు ఒకరి ప్రేమను ఒకరు గౌరవించి స్వేచ్ఛగా జీవనం గడపాలని ఇందులోని ఆదర్శ గృహిణి మెటిల్డా మనకు తెలుపుతుంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...