11, మే 2021, మంగళవారం

సెలవుకు సెలవు

 ఏ పురుగూ తలదూర్చకుండా

ఏ మనిషీ మితిమీరకుండా 

వేయి కనులతో కాపుగాస్తున్నారు

తీరం లేని ప్రయాణమే చేస్తున్నారు

తీరె మారాలని సాధననే చేస్తున్నారు

పోలీసు బందోబస్తు తో..

భారత భవిష్యం సుభిక్షమంటున్నారు


నీ కోసం తన వారిని దూరంపెట్టి

నీ సేవ కోసం తన ప్రాణం పణం పెట్టి

సెలవుకు సెలవు ఇచ్చి

మన ప్రాణానికి విలువిచ్చి

మన నవ్వుతో తన కష్టాన్ని మరిచే

నిత్య శ్రామికులు, మార్గదర్శకులు

భారత భవిష్యం సుభిక్షం అంటున్నారు


భారత బాగోగులు చూస్తున్నారు

భారీ క్వారెంటైన్లు ఏర్పాటు చేస్తున్నారు

మెడిసిన్లే అస్త్రాలు గా యుద్ధం చేస్తున్నారు

వైద్యులుగా భారత భవిష్యం సుభిక్షమంటునన్నారు


గాలికి తెగిన గాలిపటంలా

దారే తెలియక చూస్తున్నారు

రేయి పగలు నిదురనే మాని

దేశ దేశాల్లో

నీ ఆనవాళ్ళను

వెలికితీస్తున్నారు

వారే నీ పాలిట యమదూతలు శాస్త్రవేత్తలు

 

కరోనా నిన్ను

సంఘటితంగా

సాగనంపుతాం

సమూలంగా నిర్మూలిస్తాం

నాటి నారదుడే నేటి విలేఖరి. (కవిత)

తెల్ల బట్టలు

మెడలో స్టెతస్కోప్ లు

మెడిసిన్ లే ఆయుధాలు

దవాఖాన ల దాపురించిన

డాక్టర్లే దేవుళ్ళు


సమాచారమే సాహిత్యము

ప్రజాక్షేమమే సంతోషము

కదన రంగాన కట్టడి చేసిన

నాటి నారదుడే నేటి విలేఖరి


ఊరు స్వచ్చం

వాడ పరిమళం

నెత్తిన గంపలు

చేతిల చీపుర్లు

చీల్చి చండాడుతున్న

పారిశుధ్య కార్మికులు దేవుళ్ళు.

ఆదర్శం (కవిత)

 గెలుపు కుందేలు ది కాదు తాబేలు దే..
ఓర్పు ఉన్న 🐡*తాబేలు* ఆదర్శం

విడిపోయిన రెండింటిని కలపడానికి తాపత్రయ పడే 🥢*సూది* ఆదర్శం...

తన మూలంగా లోకం ఆగిపోకూడదని రోజంతా వెలుగునిచ్చే 🌞*సూర్యుడు* ఆదర్శం...

తను కరిగిపోయినా పక్కవాల్లకు వెలుగునివ్వాలనుకునే
🕯️ *కొవ్వొత్తి* ఆదర్శం...

తీరాన్ని సంద్రంగా మార్చాలని అనుక్షణం ప్రయత్నించే *అలలు*🌊 ఆదర్శం..

పడకొట్టిన వాడిపైన పగపట్టకుండా,
 
దారం దారం పోగేసుకుని మరో గూడు కట్టుకునే *సాలేపురుగు*🕸
ఆదర్శం..
🍃🌸🍃🌸🍃🌸🍃🌸

కలిసేలా చేసిన కరోనా (కవిత)

 కనిపించని కరోనా అది

యాస లేని మహమ్మారి అది

యాది మరిచి చైనానే

యాలడవడింది మన గుమ్మమ్ముందే

యాది మరిచి బయటికోతే

మతితప్పిన మహమ్మారి పట్టుకుంటే

అస్తికల జాడ కూడా దొరకనట్టు 

బూడిద కూడా కనిపించనట్టు

కనుమరుగై పోతావు 

కనిపించని కరోనా అది

కనిపించని అనుభూతుల్ని

కలయికతో వచ్చే సంతోషాన్ని

కలవరపెట్టే మాధుర్యాన్ని

కమ్మని వంటింటి వంటకాన్ని 

కలిసేలా చేసింది కరోనా.

కనిపించని కరోనా అది

తెలుగు బంధం (కవిత)

 అచ్చులు హల్లులు అమ్మా నాన్నలు

భాషాభాగాలు బాబాయీ లు

పదబంధాలు పలకరించే పిన్నమ్మలు

అన్నయ్యలు అన్నింటికీ అలంకారాలు

ఒత్తుల వరసలు వదినమ్మలు

తమ్ముళ్లు తోడుండే తెలుగు వెలుగులు

ఛందస్సే చిలక పలుకుల చెల్లెమ్మ

విద్యనందించే లఘువులు, గురువులు

బహువచనాలు బావమరుదులు

సంధులు, సమాసాలు చుట్టాలు పక్కాలు

విభక్తులు వీధి స్నేహితులు

ప్రతిపదార్థాలు ప్రాణ స్నేహితులు

విమర్శించే వాళ్ళు వ్యతిరేక పదాలు

సమర్థించే వాళ్ళు వ్యుత్పత్తర్థాలు

గడిచిన జ్ఞాపకాలు (కవిత)

ఏమి వెతుకుతున్నావూ


మూసిన నీ పుస్తకాన్ని


చెరిగిన పాదముల చిహ్నాల కోసం


ఒంటరిగా కూర్చుండి


కదిలే గాలికి కబళమునిస్తున్నావ


వనము వంటి వసతిగీములో


నివాసముంటూ


పదికి లేచినా సరిపోని నిద్రను మింగి


వంట కోసం వంతులేయడం


నీటి కోసం కాటికెళ్ళడం


పర్యాప్తించిన పేస్టును పిండుతూ


పాసిన పళ్ళను తోముతూ


నీటితో జలకాలాడటం


అరిగిపోయిన సబ్బుతో


అభ్యంజనమాచరించి


అనిగి మనిగి అరకొర కూరలను


ఆరగించి ఆనందమొంది


అడ్జెస్టు చేసుకొన్న జీవితాన్నా


నీవు నెమరేస్తున్నది


ప్రార్థనలో అడుగిడ కుండా


తరగతి ని తరగతి కి అప్పజెప్పి


తరువుల కింద తందానలాడుతు


సాగించిన సంభాషణలో


సారాంశం ఏముంది


అన్నదాన లైను లో


ప్లేటు పట్టి పాకులాడిన వైనం


వడి వడి గా


తెచ్చి తాగిన వైను వైనం


కౌముది వెలుగులో


నిశీధి నిశ లో


సీసాలు బద్దలు కొట్టిన జ్ఞాపకం


ఒక జ్ఞాపకమేనా


టిపి లలో టీచర్ల మై


నిండని కడుపుతో


మాడుతున్న కళ్ళతో


కర్రపట్టుకు పోజులిస్తిమి


దీనికి ప్రయోజనం లేదని


తెలిస్తే మాత్రం ప్రయోజనమేమిటి


భయంకర హాస్టల్లో


ఒకడు కునుకు తీస్తాడు


ఒకడు బాతాఖానీ కొడతాడు


ఒకడికి ఏడుపుకి నవ్వొస్తుంది


ఒకడి నవ్వు ఏడుపు తెప్పిస్తుంది


జడిగొల్పే ఈ దుఃఖానికి


తడవకుండా గొడుగు వెతుకుతున్నావా


గడిచిన రెండేళ్లూ


మేఘాన్ని చూస్తూ


కాలాన్ని మరిచాం


కర్పూరం లాంటి


కాలం కాలుతూ పోయింది


సర్టిఫికెట్ సిగరి చేతిలో పడింది


లాక్ డౌన్ ఎడారి లో


కాళ్ళు తెగిన ఒంటరి ఒంటె లాగా


వీధి చివర్లో


కొంగ జపం చేస్తూ


డైటు ను నెమరేస్తున్నావా


గడిచిన జ్ఞాపకాలను వెతుకుతున్నావా

10, మే 2021, సోమవారం

నా దేశం (కవిత)

 ఈ దేశము హిందూదేశము

ఈ దేశము మన భారతదేశము

ఈ దేశము కర్మభూమిదేశము

ఈ దేశము ధర్మభూమిదేశము

ఈ దేశము రాముడేలిన దేశము 

ఈ దేశము వేదభూమిదేశము

ఈ దేశము అవతారమూర్తుల నిలయము

ఈ దేశము పవిత్రదేశము

ఈ దేశము అతిపురాతనదేశము 

ఈ దేశము మాటలకందని నాగరికత గల దేశము

ఈ దేశము ప్రపంచానికి అన్నపూర్ణ దేశము

ఈ దేశము ప్రపంచానికే ఒక్కటే దేశము 

ఈ దేశము యెక్క ధర్మము హిందూధర్మము

ఈ దేశము మతా తీత దేశము పుణ్యదేశము

ఈ దేశము ప్రపంచానికే భాగ్యవంత దేశము

ఈ దేశము సర్వ ప్రాణులకు మోక్షదామము మోక్షదేశము

ఈ దేశము మాతృమూర్తులదేశము

ఈ దేశము స్త్రిదేశము

ఈ దేశము స్వేచ్ఛావాయువులు కలిగిన దేశము

ఈ దేశము గోదేశము

ఈ దేశము పరమాత్ముని నిలయదేశము

ఈ దేశము ప్రపంచానికే గురువు గురుస్తానదేశము

ఈ దేశము పుణ్యమూర్తులకు నెలవు గల దేశము

ఈ దేశము శాంతిగల శాంతిదేశము

ఈ దేశము దైవదేశము

ఈ దేశము మట్టికూడా పవిత్రము దైవత్వము గల దేశము

ఈ దేశము సర్వలోకాలహితమును కోరే ఏకైక దేశము

ఈ దేశము అణువు అణువు లో ను దైవాన్ని చూసే ఆధ్యాత్మికత గల ఏకైక దేశము 

ఈ దేశము సాక్షాత్తు పరమాత్మునిచే లోకానికి జ్ఞానబోధ చేసిన దేశము ఏకైక భాగవద్గితాదేశము

ఈ దేశము ఎంత ఎదిగినా ఒదిగివున్న ఏకైక దేశము

ఈ దేశము సాహసోపేతమైన దేశము

ఈ దేశము ను ఎంతమంది చరిచినా పవిత్రము తగ్గని పవిత్రముగానే వుండే ఏకైక దేశము నిప్పు గల దేశము

,,,,,,,

✍,,,,,,,,,,,,,

     నా భారతాదేశము 

         మాతృదేవోభవా

                  పితృదేవోభవ

                          అతిధిదేవోభవా

                                 ఆచార్యదేవోభవా


  లోకాసమస్థాసుఖినోభావంతు

 సర్వం శివార్పణమస్థు 

ఎవరు అవును అన్నా, కాదు అన్నా

ఎలా వున్నా, ఎప్పుడైనా,ఏమైనా నిప్పు నిప్పే ,  

ఇక్కడ మతములు లేవు మతలబులు లేవు

  ఒక్కటే 

హిందూధర్మము భారతదేశము

నా మన భారతదేశము,,,,

ఏకాంతం (కవిత)

కాంతి పుంజమా! 

ఏకాంతమా!

నాకేమీ అక్కర్లేదు అని

నిస్వార్థంగా

పువ్వులు పరిమళాలు వెదజల్లినట్లు

సూర్యచంద్రులు కాంతిని వెదజల్లినట్లు

నిశ్శబ్దంలో నుండి శబ్ధం పుట్టినట్లు

ఏకాంతం నుండి ఓ కాంతి వెలువడుతుంది

ఆలోచనలే ఆ కాంతి.

వెలుగులే మన మెరుగులు.

అందుకే అంటాను

ఏకాంతం కాంతిని పంచే కాంతి సౌధం అని.

6, మే 2021, గురువారం

వానజల్లు (కవిత)

 నీలాకాశం లో

మబ్బులు వేగంగా కదులుటకు

గాలి సాయం కావాలనుకున్నాయి!

చల్లని గాలి నల్లని మబ్బులను తగలగానే

చినుకుల వర్షాన్ని ప్రసవించి

వంపుల వాగులతో పరవళ్ళు తీసి

వాగు నది గా మారి 

సముద్రుడి లో కలవడానికి 

తహతహ లాడుతున్నాయి!


వాన చినుకులు లేకపోతే

పుడమికి పచ్చదనం ఎలా వస్తుంది?

వరణుడు అవనిని తాకినపుడు

పుడమికి లేలేత చిగుళ్ళు

పచ్చటి చీర నేస్తుంది!

పువ్వుల నవ్వులతో

పరవశించి పోతుంది!


మబ్బులు పొదిగిన ఆకాశం

బరువెక్కిన ప్రతిసారీ

తటపట చినుకులతో

భూమిని తడుపుతుంది!

కొన్నింటిని దాచుకొని

సేద తీరుటకై నీడనిస్తుంది!

మబ్బులు లేని ఆకాశం

పూలు లేని తోట నే కదా!

ఏమి తెలుసు? (కవిత)

 ఏమి తెలుసు?

ఎక్కడ తెలుసు?


సుస్వరాలన్ని సారా తాగినట్టు

అష్ట దిక్కులన్నీ అంగి వేసినట్టు

పంచ భూతాలన్నీ పంచె కట్టినట్టు

సప్త సముద్రాలన్నీ సంచీ లో ఉన్నట్టు

అన్ని తనకే తెలుసని

పోజు కొట్టడం తప్ప!


రొమ్ము పాలు తాగి

అమ్మ ను తన్నినట్టు

అమ్మ భాష నేర్చి

పర భాష గొప్పదని

పోజులిచ్చే జులాయి కి

ఏమి తెలుసు

అమ్మ భాష గొప్పదనం!

అన్నీ నాకే తెలుసని

పోజుకొట్టడం తప్ప!

స్మరించాలని ఉంది (కవిత)

 నింగి కి నేత్రం సూర్యుడైతే 

పుడమికి అందం ప్రకృతైతే 

జీవానికి ప్రాణంవాయువైతే

జీవకోటికి గొడుగువు నీవు

అందుకే నిన్ను సేవించాలని ఉంది

స్మరించాలని ఉంది


నేనెందుకు పారాలని నది నిట్టూరిస్తే

కరువు కమ్మేయదా నేనెందుకు కష్టించాలని

మనిషి ఆగిపోతే జీవితం జీర్ణిస్తుందా

నేనెందుకు వీయాలని గాలి గోల చేస్తే

జీవి గాలిలో కలిసి పోదా

అందుకే నిన్ను సేవించాలని ఉంది

తల్లీ భారతీ

నిన్ను స్మారించాలని ఉంది

ఏమని తెలుపను నేస్తం? (కవిత)

 ఏమని తెలుపను నేస్తం?


చీకటి కమ్ముకున్న

రాత్రిలో నేనున్నానని

చంద్రుడు వెన్నెల కురిపించాడు!

ఆటలో తనూ 

ఉండాలనుకున్నాడేమో

దీనంగా చూస్తున్నాడు!

వెన్నెల లో 

మనమాడిన ఆట

నిశి ని మరిపించింది!


నల్లటి మేఘం అడ్డువస్తే

పక్కకు జరిపిమరీ

తీక్షణంగా చూసాడు శశి!

తనూ బాల్యాన్ని

గుర్తు చేసుకున్నట్లు గా

మన వంకే చూసాడు!


బాల్య స్మృతులు

మనసులో మెదిలే

ఓ బాల్య నేస్తం!

ఏమని చెప్పను?

మన బాల స్మృతుల గురించి!

ఎక్కడికి వెళ్తావ్? (కవిత)

 నిశ్శబ్దం శబ్ధం చేస్తోంది!

శబ్ధం మౌనం పాటిస్తోంది!!


నిశి నడుస్తోంది!

పగలు పరుగెడుతోంది!!


నువ్వెక్కడికెళ్తావ్?


అక్షరాలు కలిసి పుస్తకాలైనాయి!

పుస్తకాలన్నీ మెదడు లో నిక్షిప్తమౌతున్నాయి!!


కాలం విలువ తెలీనోడు కాలక్షేపం చేస్తుండు!

తెలిసినోడు కావ్యాలే చదివేస్తుండు!!


నువ్వెక్కడికెళ్తావ్?


కొందరు

సెలవుకు సెలవిచ్చారు!

ప్రాణాన్నే పణం పెట్టారు!!

అందరినీ కాదని

కాలు బయట పెడితే

కనిపించకుండా పోతావ్!

కారడవిలో చిక్కుకుపోతావ్!!

కనిపించనంత దూరం వెళ్ళిపోతావ్!!!

కరోనా గృహనిర్బంధం కొరకు)

అయ్యో పాపం! (కవిత)

 చినుకులు చిరుగాలినడిగాయి

ఎందుకింత విషపూరితమైనావని


చెట్టు నీడనడిగింది

నీ ధరికి ఎవరూ రావట్లేదెందుకని


వరద వాననడిగింది

నీలో ఎవరూ తడవట్లేదెందుకని


మనిషి మనిషిగా ఎప్పుడవుతాడని

పడిగాపులు కాస్తున్నాయేమో పాపం!


మనిషికంటిన మాలిన్యం (కరోనా) గూర్చి

వాటికి తెలీదేమో!

అన్వేషణ (కవిత)

(2020 లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ప్రచురించిన "యాస" కవితా సంకలనం లో ముద్రితమైన కవిత)


నీ కోసమే నా అన్వేషణ!

నీ కోసమే నా ఆరాటం!!

నిన్ను వెతుకుతుంటే 

సంద్రమనే జీవితకెరటాల్లో కొట్టుకుపోయి, 

ముత్యాల కోసం వెతికినట్టుంది!!

నీ కోసం

నీ వార్త కోసం

విలేకర్ల విలాపాన్ని,

దినపత్రికల

దీనాలాపాన్ని

నేను సహించలేను!!

ఇంతకూ ఉన్నావా నువ్వు?

నువ్వుండేది మనిషి లోనా?

లేక మృగం లోనా?

పాత వస్తువులను

అగ్ని దహించినట్లు

కొంపదీసి

నువ్వు కూడా

కాలిపోయావా యేమి??

రానూ రానూ

రచయితల రాతలకు

కవుల కవితలకుమాత్రమే 

పరిమితమౌతావేమోనని

భయమేస్తోంది!!

మనిషిలో కనిపించే మనిషిని కని పెంచే మానవత్వమా..

జర అందరిలో వెలుగుమా!

(కరోనా కష్ట కాలం లో మానవత్వం మం కలిసి పోవడం చూసి..)

రమణీయ పిలుపు (కవిత)

భాగ్యోదయ అమృత బాండం ఈ మట్టి!

 బహుముఖ సంస్కృతికి నిలయం ఈ మట్టి!

 విశ్వానికే ఓనమాలు నేర్పిన విశ్వగురువు ఈ మట్టి!

రాముడి వంటి రాజర్షి ఈ మట్టి!

కృష్ణుడి వంటి కరుణామూర్తి ఈ మట్టి!

పసిడి పైరులెన్నింటినో పట్టుచీరగా మల్చుకున్న పుడమి ఈ పుడమి!

నదీజలాలను ఆనంద భాష్పాలుగాఅలరించిన అవని ఈ భారతావని!

సాగరం వంటి విశాల సంప్రదాయం కలిగిన సరి భూమి ఈ భూమి!

ప్రకృతి చీర పసిడి అంచువై

పల్లె కటి వడ్డాణమై

సంప్రదాయ ఉయ్యాలవై

సమిష్టి కుటుంబ రాగానివై

అనురాగ పందిరివై

అలరించే ఓ భారతావనీ!

నిన్ను మించినదేదేశమూ లేదు!!

అందరినీ ఒకటే చేత

అందరిదీ ఒకటే బాటగా

సాకిన నీ ఆత్మీయ అనుబంధం

కమనీయ కల్పవక్షం

నీ తెలివైన తలంపు తో

అందరినీ ఒక్కటి చేసే

నీ రమణీయ పిలుపు 

*"వందే మాతరం"*

.

*🙏భారతమాత కీ జై🙏*

వివేక భారతి ఆటవెలదులు - 9

41.

మంచి హితుడు లేని మనిషి మనిషి యేల
మనసు లేని మనిషి మనిషి యేల
మంచి మాట లేని మనిషి మనిషి యేల
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ
42.
సజ్జనుడుడి మాట సన్మార్గ సూచిక
తప్పు పెరిగినపుడు తరిమి వేయు
చుక్క మెరుపు మెరువు చీకటున్నప్పుడే
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ
43.
అద్రి పొడుపు రంగు అరుణ వర్ణమునుండు
పొద్దు పెరుగు కొలది పొగరు మారు
కాలమునకు తగ్గ కార్యచరణ చేయి
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ
44.
నీరు తీర్చు నీకు నిండైన దాహము
కూడు తీర్చు నీకు కొంత గొద ను
మంచి పుస్తకంబు మార్చు నీ బతుకును
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ
45.
పగలు వెనక రాత్రి పగ పెంచుకున్నట్లు
వాన వెనక ఎండ వచ్చినట్టు
మంచి చెడుల మధ్య పొంచి వుండు వైరము
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

46.

తండ్రి వేయు దెబ్బ తనయుడి మేలుకే

తల్లి వేయు దెబ్బ తనయ లలికే

గురువు వేయు దెబ్బ గుణవంతుడగుటకే

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

47.

అమ్మ మాట వుండు ఆనందమయముగా

నాన్న మాట వుండు నవనితముగ

గురువు మాట వుండు గుర్తించు విధముగా

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ


వివేక భారతి ఆటవెలదులు - 8

 36.

పల్లెటూరి పసిడి పైరు పంటలె కాదా

పంట మారి పాయె ప్లాటు లాగ

పనులు లేక పల్లె కన్నీరు గా మారె

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

37.

గొప్పతనము రాదు గుర్తించినప్పుడు

గొప్ప వారి చరిత గోచరించు

గొప్పతనము పోదు గుర్తించనప్పుడు

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

38.

సంద్ర మంత చిక్కు సాధించు సమయాన

మత్స్య రూపు దాల్చు మరవకుండ

కాదు సింహ మనిన కడలి నిను మునుపు

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

39.

జేబు తడిమె మైత్రి జగమెల్ల నుండును

జేబు వెనక గుండె జూడ గలడ

గుండె లోని మనసు గుర్తించుడే మైత్రి

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

40.

బాళిభగము లేక ఫలితమేల, రణము

రాజి లేక రాజ్య విజయ మేల

విత్తు వేయ కుండ విటపి యంటేయేల

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

వివేక భారతి ఆటవెలదులు - 7

 31.

వాతికాసులడుగు వాడు నాయకుడేల

చేయి చాచి యడుగు చరకుడగును

లంచ గొండి తనము లాభమేమి ప్రజకు

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

32.

పద్య మేల తట్టు పడిగాపులుండిన

పుస్తకములు చదువు పెక్కు గాను

మాట గూడ మారు మంచి పద్యంబుగా

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

33.

మాట నేర్ప వచ్చు మకరాంక హయము కు

మాటలేల వచ్చు కంట కముకు

కుటిల బుధ్ధి చదువు కరటము వలె నుండు

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

34.

గురువు వేయు దెబ్బ గుణవంతుడగుటకే

విద్య వచ్చు చుండు వివరిణుడికి

ఛేది మెరువలన్న ఘాతమేయవలెను

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

35.

అక్షరములు రెండు అవని ఓర్పు కలవు

మిన్ను హద్దు గాను అనుగు వుండు

అమ్మ లోని శాంతి అవనిలోనే లేదు

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

వివేక భారతి ఆటవెలదులు - 6

 26.

పరుల యందు వుండు నరుడును అసురుడున్

అసుర బుద్ది నీకు అక్కరేమి

మంచి ఒకటె చూడు మనిషిలోని మదిలో

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

27.

గోవు పాలె మనకు దేవుడిచ్చిన వరం

ధేనువందు వుండు దేవతలును

సకల రోగమగద సౌరభేయె అజుడు

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

28.

అధ్వరములు చేయు అసుర బృందము కూడ

భాగవత పఠనము భాగ్యమేల

ఆచరించినపుడె అసలైన ఫలమొచ్చు

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

29.

మానవత్వపు మది మంచిచేయుచునుండు

దానవత్వపుమది దైన్యముగను

దైవ గణముల మది దివము యదార్ధము

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

30.

రొక్కమెంత వున్న లోభికి తుఛ్ఛమే

ముత్యమంత కూడ దత్తమేల

కూడ బెట్టు ధనము కాటికెట్లొచ్చును

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

వివేక భారతి ఆటవెలదులు - 5

21.

కఠిన శిలలు దొరుకు కలలోన యిలలోన

అరుణ పలము దొరుకు అబ్బురముగ

అంకమాలికుండు అరుణ పలమువోలే

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

22.

ఎండ మావి లోన యేటి నీళ్ళేలరా

ఇప్ప నూనె యేల ఇసుక లోన

మంకు బోతు నోట మంచిమాటేలరా

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

23.

పశువు చంపు నేల పర పశువుమదిని 

మానవత్వమేది మనిషి లోన

మనిషి చంపు మనిషి మదిని మనసులేక

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

24.

పరుల పీడనంబు బహుళ సుఖము యేల

పరుల మంచి కోరు పరిమళముగ

పంచు మంచి బుద్ధి పగ వీడి కసి వీడి

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

25.

పుస్తకాలు వుండు పెక్కు విధంభులు

పొందుపర్చు అన్ని ఫోను యందె

అక్షరాలు అన్ని అరచేతిలోనెగా 

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

వివేక భారతి ఆటవెలదులు - 4

16.

తేట తెలుగు కలలొ దేవలోక తలుపు

తేట తెలుగు యిలలొ తేనె పలుకు

తెలుగు లోని తీపి తెలియకుంటే యేల

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

17.

ఋణము ధనము వుండు రుద్ర రూపంబున

పరుల ధనము వుండు పాము వోలె

కటిక తమము నందు కారమన్నమె మేలు

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

18.

మనము పొందె సుఖము మంచిదో చెడ్డదో

పరుల యేడ్పు నీకు వలదు సుఖము

కోరుకున్న సుఖము కొంచమైనాచాలు

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

19.

చదువు వచ్చు నీకు తడువు లేకుండనె

సంపదొచ్చి నీతొ సరస మాడు

సమయసానుభూతిసంపన్నముండినా 

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

20.

తప్పు చేసి కూడ తప్పేల యనబోకు

తప్పు చిన్నదైన తప్పు తప్పె

తప్పు చేసి చూడు తనువేల నిద్రించు

బుద్ధిధాత్రి దివ్య భారభారతాంబతాంబ

వివేక భారతి ఆటవెలదులు -3

11.

పచ్చదనము వుండు పచ్చని చెట్టందు

తేటదనము వుండు తెలుగునందు

మనిషిలోన‌ మాయమాయె‌‌ మంచితనము

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

12

మెదడు కెరువు చదువు మేధస్సు ఘటియిల్లు

కొలువు దొరుకు కొద్ది కొరత లేక

కొలువు తోన గలుగు కొంత వెలుగుయైన

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

13.

ధరణి వంటి వోర్పు ధరణి పతికివలె

జనుల మేలు గోర జనని వోలె

నాయకుడికి వుండు నాయకత్వంబును

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

14.

చదువొకాయుధమ్ము సమర రంగములోన

రాజనీతి చదువు రాజు ఎపుడు

పెంచు పుర్రె బుద్ది పుస్తకము చదివి

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

15.

చదువు యేల వచ్చు సాధన జేయక

విద్య యేల వచ్చు వివరిణుడికి

నిండు కడుపు తోన విందు భోజనమేల

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

వివేక భారతి ఆటవెలదులు - 2

6.

లోకము నలుపందు వున్ననాడు, జగము

నందు నాగరికతలేనినాడు

వేదములను మాకు భిక్షవేసితివీవు

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

7.

అమ్మ ప్రేమ వుండు యలరు వోలె పొలయు

తండ్రి ప్రేమ వుండు తావి వోలె

విశ్వమందు నున్న వింత యిదియె గాద

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

8.

లలన మీద యెడద గలదు యజ్ఞానికిన్

మనసు లోన లలన మైన జ్ఞాని

మేలుకీడు మధ్య మెరమెర మిదిగాద

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

9.

వుదతి సంధ్య లుండు వుదరతి కరమందు 

ప్రేమ ద్వేశముండు పేర్మి మనసు

నందు, పేర్మి వుండు నచ్చిక వెలుగందు

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

10. 

ఆకలి యని తినుట అన్నము ప్రక్రుతి,

ఆకలి యని జూచి అపహరించి

నను వికృతి, కరుణతొ దానము సంస్కృతి

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

వివేక భారతి ఆటవెలదులు - 1

1.

వాక్కు వలన గలుగు వంద బంధములును
వాక్కు వలనె గలుగు భారి తగవు
పలుకు నుండె వచ్చు పరమోషదముయును
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ


2.

అమ్మ నాన్న యంటె యాప్యాయత గలుగు
మమ్మి డాడి యనెడి మంత్రమేల
జనని భాష బొందు సౌభాగ్య సంపద
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ
3.

పసిడి గలిగిన తనువవడు దేవేంద్రుడు
వేల ధనములున్న విలువ రాదు
ఆశవిడ్చి బతుక నానందము దొరుకు
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ
4.

దేశమందు యెంతెదిగినవన్నది గాదు
ఎంత తగ్గలో పఠించి చూడు
ధిల్లి కి ప్రభువైన తల్లికి దనయుడే
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ
5.

ఫలములున్న చెట్లు నేల కొరుగు నట్లు
పలుకు నందు పద్య పరవశ ముకు
ధరణి వంటి వోర్పు ధరియించు సుకవిలా
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ

1, మే 2021, శనివారం

పిల్లుల పేరాస

కథ పేరు:- పిల్లుల పేరాస

ఛందస్సు:- మంజరీ ద్విపద

( దీనికి స్టోరీ మిర్రర్ నిర్వహించిన seedhi baat పోటీలో ఏడవ బహుమతి లభించింది )

మార్జాలములు రెండు మంచి నేస్తములు
సహవాసు లిద్దరీ సంచార వేళ
రుచికర మైనట్టి రొట్టె కనపడె
పరుగు పరుగున పోయె రుచి చూచుటకు
మార్జాలములు రెండు మందట పడెను
రోటి కొరకు వాటి పోటి పెరిగె
రొట్టెను జీల్చిన రొండు గా మారె
ఒకముక్క చిన్నగా ఒకటి పెనుపుగ
పెద్ద ముక్క కొరకు పెద్దగా అరిచి
నేను భుజింతు నేనె భుజింతు ననుచు
మాట మాట పెరిగి మర్యాద వదిలి
జగడము పెరుగుచు తగవు తరగక
నొక కోతి గన్గొని తగవాపు మనిన,
గొద గల్గిన కపియు మండలముల తొ
నిట్లనియె "తమకున్న తగవాపెదను
తక్షణమున నొక తక్కెట తెమ్ము
తూచి దాన్ని ఇపుడు తుల్యము చేసి
పంచి ఇచ్చెద" ననిన చిలికాండ్లు తమ
తక్కెట తెచ్చిరి తరుల మెకమున
కిచ్చి మాకు సమము తూచి యిమ్మనెను
ఆకలి కీశము ఆహా యనుచుచు
రెండు కండములను రెండు పళ్ళెముల
లోవేసి తూచగా, లోపమైందనుచు,
పెద్దదైన దనెను, పేరాస తోటి
అట్లు ముక్క కొరుకగా నది చిన్న
ముక్క యయ్యె, నపుడు ముక్కచిన్నదని
నోటిలో వేసె, నపుడు పిల్లి జూసి
బేలు జరిగె నని బిక్కమోమేసె

నీతి:-
మిత్రులిద్దరి మధ్య మందట వలదు
పేర్మి పెంచు కొనుము పెక్కు విధముగ
పేరిమి పేరుతో పేరాస పెరిగి
న, ఫలమందుకొనుడు నడి నున్న మనిషె!:

డిక్లరేషన్:

కథ పాతదే అయినా దాన్ని మంజరీ ద్విపదలో కూర్చడం జరిగింది. ఇది నా సొంత రచన ఎక్కడ నుండీ కాపీ చేసినది కాదు. 


పేరు: మ్యాడం అభిలాష్
మొబైల్: 8142576346


గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...