28, ఏప్రిల్ 2021, బుధవారం

ప్రాచీనతను ప్రతిబింబించే సామెతలు - కనుమరుగవుతున్న పదాలు, పద్దతులు

      మన సంస్కృతీ సంప్రదాయాలకు, జీవన విధానానికి సామెతలు ప్రతిబింబాలు. ఒక్కో సామెత ఒక పేజీ వ్యాసం చెప్పలేని విషయాన్ని విపులంగా చెప్పగలదు. అట్లాగే మనం చెప్పే విషయానికి వెన్నుదన్నుగా నిల్చి మరింత స్పష్టతను చేకూర్చుతాయి సామెతలు. సామెతలు కొన్ని ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నవి.. కొన్ని మార్పులతో ప్రస్తుతం జనం నోళ్లలో నానుతూ ఉన్నవి కూడా కనిపిస్తాయి. అదుగో అటువంటివి కొన్ని సామెతలు..

1) కరణం సాధువూ కాడు - కాకి తెలుపూ కాదు

      ఈ సామెత కరణం పదవి లో ఉన్న వ్యక్తి స్వభావాన్ని గూర్చి తెలుపుతుంది.

     ఈ సామెతలో ' కరణం ' అనే పదం ఒక గ్రామ అధికారి యొక్క పదవిని తెలియజేస్తుంది. ఇది రాయలసీమ మాండలికానికి చెందినది గా పరిగణించవచ్చు. ప్రాచీన కాలం లో ఈ పదానికి సమానార్థకంగా 'రెడ్డి' , ' కర్ణం ' అనే పదాలను వాడేవారు. ఈ పదం నేటి వ్యవహారిక భాషలో కనుమరుగైనది గా చెప్పవచ్చు. దీని స్థానం లో తెలంగాణ మాండలికం లో 'పట్వారీ' , ' పోలీస్ ' , ' పటేల్ ' అనే పదాలను వాడుతున్నాము.

    ఇక్కడ సాధువు అంటే ఉత్తముడు, ఉదాత్తుడు, సన్మార్గి, సహృదయుడు, సత్ప్రవర్తకుడు గా చెప్పవచ్చు. అలాగే సాధువు అంటే సన్యాసి, ఋషి, ముని అనే అర్థాలు కూడా వస్తాయి కానీ వాటిని ఈ సామెత లో పరిగణించడం సమంజసం కాదు ఎందుకంటే ఇక్కడ కరణం పదవిలో ఉన్న వ్యక్తిని దుర్మార్గుడిగా భావించడం జరిగింది.

      ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు అంటాడు వేమన. అదే విధంగా జగమెరిగిన సత్యాలు, ఎప్పుడూ స్థిరంగా ఉండే స్వభావాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకు సూర్యుడు తూర్పున ఉదయించడం, నీరు పల్లం వైపు ప్రవహించడం మొదలైనవి. అలాగే కాకి ఎప్పటికైనా తెలుపు రంగులో కి మారుతుంది అని అనుకోవడం మూర్ఖత్వమే కదా! కాబట్టి ఇక్కడ కరణం పదవి లో ఉన్న వ్యక్తిని కాకి తో, సాధు స్వభావం కలిగిన వ్యక్తిని తెలుపు రంగు తో పోల్చడం జరిగింది. ఎలా అంటే కాకి ఎలా తెలుపు రంగులోకి మారలేదో అలాగే కరణం పదవిలో ఉన్న వ్యక్తి సన్మార్గుడు కాడని చెబుతుందీ సామెత.

    ఆధునిక కాలం లో కొందరు రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేస్తూ, ప్రజలను డబ్బులకు లొంగదీసుకొని ఓట్లు వేయించుకోవడం...గ్రామాల్లో గానీ నగరాల్లో గానీ కొందరు గూండాలు బలహీనుల ను లొంగదీసుకోవడం, లంచాలు వసూలు చేయడం వంటి వారి మారని స్వభావాన్ని ఈ సామెతకు ఉదాహరణగా చెప్పవచ్చు.

2)సింగినాదం జీలకర్ర

     సింగినాదం అనే పేరు శ్రుంగనాదం (కొమ్ము బూర) అనే పదం యొక్క రూపాంతరం. శృంగనాదం లేదా కొమ్ము బూర అంటే ప్రాచీన కాలం లో ఊర్లలో ఏవైనా కొత్త పదార్థాలు అమ్మడానికి వస్తే ఈ బూరలను ఊదుతూ సాటింపు చేసేవాళ్ళు. ఆ కాలం లో వారానికి ఒకసారి సంతలు జరుగుతుండేవి. ఆ సంతల్లో అప్పుడప్పుడు మాత్రమే జీలకర్ర అమ్మే వారు వచ్చేవారు. అలా వారు వచ్చినట్లు అందరికీ తెలియాలన్న ఉద్దేశ్యంతో శ్రుంగనాదం లేదా కొమ్ముబూర తో ఊదుతూ సాటింపు చేసేవాళ్ళు అలా శ్రుంగనాదం జీలకర్ర పేరు స్థిరపడింది అది క్రమంగా సింగినాదం జీలకర్ర గా రూపాంతరం చెందింది. కానీ ఈ పద్దతి ఆధునిక కాలంలో అంతరిచడం గమనార్హం.

     సామెత వెనక ఉన్న చరిత్రను ఒకసారి పరిశీలించినట్లయితే... 16వ శతాబ్దములో రాయలు వారు అస్తమించిన తర్వాత ఆంధ్రరాజ్యము దిక్కులేని దివాణ అయింది రాయలు అనంతరం రాజ్యము అరాచకమై చాలా అల్లకల్లోలాలు జరిగినట్లు చరిత్ర. ఆసందర్భములో తురుష్క ప్రభువులొక ప్రక్కనుండి తెలుగుభూమిని కబళించారు. అపుడు బలిష్ఠులైన కొందరు తురుష్కులు నాధుడులేని తెలుగుగడ్డమీదపడి లూఠీచేసి వస్తువాహనాలు చేజెక్కించుకుపోయేవారు. ఈ తుంటరిమూక ఊరుబయట తామువచ్చినట్లు గుర్తుకోసం వాళ్ళధర్మమా అంటూ సింగినాదం (శ్రుంగనాదం) చేస్తూండేవారు. ఆ సింగినాదం వినడమే ప్రజలకు పైప్రాణాలు పైననే పోయేవి. అపుడు జనులు మూటా, ముల్లే కట్టుకొని పారిపోయేవారు. కానీ ఈలోపనే మూకలు పైబడి ఊళ్ళు దోచుకొనేవారు.... సరిగ్గా అదేసమయంలోనే కాబూలు దేశం నుండి ఆఫ్ఘనుల మూకలు జీలకర్ర బస్తాలు వేసుకొని హిందూదేశానికి కొత్తగా దిగుమతి చేస్తూండేవారు. వాళ్ళుకూడా ఊరిబయట తమరాకకు గుర్తుగా వేరొక మాదిరి ధ్వనిగల సింగినాదం (A horn) చేస్తూండేవారు. ప్రజలు ఈ రెండువిధానాలయిన సింగినాదాలు వినడంలో తడబడే వారు. అపుడెవరో బుద్ధిమంతుడుండి ఓరినాయినలారా అదితురుక గుంపుల సింగినాదం కాదు. కాబూలువారి జీలకర్ర సింగినాదంమోయి మనం భయపడనక్కర్లేదు. అని తెలియజెప్పినమీదట ప్రజలు భయపడడం ఆపి నిర్లక్ష్యంగా నిద్రించేవారట. అప్పట్నుంచి క్రమంగా నిర్లక్ష్యార్ధంలో జీలకర్ర సింగినాదం అలవాటయిపోయిందని పెద్దలు అంటారు.

     ఆధునిక కాలంలో ఈ సామెతను నిజమో అబద్దమో తెలియని మాటలకు సింగినాదం జీలకర్ర అని కొట్టిపారేస్తుంటారు. మరియు ఎవరైనా చిన్న విషయాలకు పెద్ద గోల చేస్తే ఇది సింగినాదం జీలకర్ర గోల లాగా ఉంది అంటూ సామెతను వాడుతుంటారు.

3)దువ్వు ని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు

     దువ్వు అంటే చిరుతపులి అని అర్థం. ఈ సామెత నాచన సోమన కాలం (క్రీ. శ.1350)నాటిది. ఇక్కడ దువ్వు అనే పదం క్రమంగా పులి గా మారి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనే సామెతగా మారిపోయింది. ఈ రెండు సామెతల్లో అర్థం ఒకే విధంగా ఉన్నా, పదాలు వాడకం లో తేడాను మనం గమనించవచ్చు. కాలానుగుణంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో పదాలను మార్చడం ఈ సామెతలో గమనించవచ్చు.

     పులి చారలను చూసి నక్క పులిగా మారిపోవాలని వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి గా మారలేదు. ఇక్కడ పులిని గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తి లా, నక్కను సామాన్య స్వభావాలు కలిగిన వ్యక్తి గా భావించడం జరిగింది. పులి యొక్క భౌతిక లక్షణాలను నక్క మార్చుకున్నంత మాత్రాన పులి యొక్క మానసిక స్వభావం నక్క పొందలేదు. అంటే గొప్పవారిని చూసి అనుకరించినంత మాత్రాన సామాన్యులు గొప్పవాళ్ళు కాలేరని దీని భావం.

     ఒక గొప్ప సాధు స్వభావం కలిగిన వ్యక్తి ఎలా ఉన్నడో, ఏయే వస్త్రాలు ధరిస్తున్నాడో అవే వస్త్రాలు ఇంకో వ్యక్తి అనుసరించి అవే వస్త్రాలు ధరించడం వంటివి చేసినంత మాత్రాన ఆ వ్యక్తి మానసికంగా మాత్రం సాధు స్వభావం కలిగిన వ్యక్తి గా మారలేడు. ఇటువంటి సందర్భాల్లో ఈ సామెతను వాడటం జరుగుతుంది.

4) గానిగోనికి ఎద్దు కావద్దు చాకలోడికి గాడిద కావద్దు

     గానుగ అంటే ఒకరకమైన పురాతన కాలం నాటి యంత్రం. తైలయంత్రము, పరంజము అనేవి గానుగకు సమానార్థక పదాలు. గానుగల్లో ప్రధానంగా మూడు రకాలున్నాయి. చెరుకు గానుగ, నూనె గానుగ, సున్నం గానుగ. ఈ గానుగ యంత్రాల సహాయంతో నూనెను తీయడానికి ఆ వర్తకుడు గానుగకు ఎద్దును కట్టి కొడుతూ తిప్పుతూ ఉండేవాడు అంతే గానీ ఆ ఎద్దు యొక్క బాగోగులు గానీ దాని తిండి తిప్పలు పట్టించుకునే నాథుడే ఉండేవాడు కాదు. కానీ ఆధునిక కాలంలో ఈ గానుగలు అంతరించి పోయాయి. గానుగల్లో ఎద్దులను వాడే స్థానం లో యంత్రాలను వాడుతూ ఆధునికీకరణ చెందడం జరిగింది.

      చాకలి వారి ప్రధాన వృత్తి బట్టలు ఉతకడం మరియు అధిక బరువైన సరుకు ను ఒక చోటు నుండి మరొక చోటుకు కు మార్చడం. వీరు ఊర్లో ఉన్న అన్నీ ఇండ్లు తిరిగి బట్టలు సేకరించి వాటిని ఉతికి మళ్లీ వారి ఇళ్లకు అందించడం కోసం, సరుకు రవాణా కోసం వాహనాలు గా గాడిద లను వాడే వారు. ఇలా గాడిదలు అధిక బరువైన సరుకును చాలా సేపు మోయటం వాటికి భారంగా అనిపించేది. కానీ ఈ పద్దతి ఇప్పటి ఆధునిక కాలంలో అంతరించింది. గాడిదల స్థానం లో చాలా రకాల వాహనాలు అందుబాటులోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం.

    ఇలా గానుగ వాడి దగ్గర ఉండే ఎద్దు, చాకలి వాడి దగ్గర ఉండే గాడిద రెండూ అధిక పని భారం తో నలిగిపోయేవి. తద్వారా ఈ సామెత పుట్టుకొచ్చిందని చెప్పవచ్చు.

   వేతనం తక్కువ, పని భారం ఎక్కువగా ఉన్న కార్మికులకు ఈ సామెత వర్తించవచ్చు. కానీ నేటి అభివృద్ది చెందిన ఈ ప్రపంచంలో పై రెండు ప్రక్రియలు (గానుగల్లో ఎద్దులు వాడటం, చాకలి వారు గాడిదలు వాడటం) జరగడం లేదు కావున ఈ సామెత వాడకం తక్కువనే చెప్పాలి.


 5) కాలితో నడుస్తే కాశీకి పోగలమే కానీ తలతో నడిస్తే తల వాకిలి అయినా దాటగలమా

    రవాణా వ్యవస్థ లేని రోజుల్లో ప్రజలు చాలా మట్టుకు ప్రయాణం కాలినడకన చేసేవాళ్ళు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్నా, బంధువుల ఇళ్లకు వెళ్ళాలన్నా కాలినడకన ప్రయాణం సాగించే వారు. 

    మన తెలుగు రాష్ట్రానికి కాశీ పట్టణం చాలా దూరం లో ఉంది. ఆ కాలంలో కాశీకి వెళ్లి గంగలో స్నానమాచరిస్తే పాపాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అన్న నమ్మకం ప్రజలలో ఉంది. ఆ కాలంలో రవాణా వ్యవస్థ లేదు కాబట్టి ఈ సామెత పుట్టి ఉండొచ్చు.

    తలద్వారము, బహిర్ద్వారము, దోరణము అనే పదాలను తలవాకిలికి సమానార్థక పదాలుగా చెప్పవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మన మొదటి వాకిలి అని అనవచ్చు. తల తో నడిస్తే మన వాకిలి కూడా దాటలేము కదా!

     ప్రయాణ వ్యవస్థ లేని రోజులను దృష్టి లో పెట్టుకొని ఆలోచిస్తే నాటి ప్రజల్లో నడకతో కాశీకి అయినా వెళ్లగలమనే సంకల్పం ఉంది. నడక ప్రాధాన్యతను ఈ సామెతలో మనం గమనించవచ్చు. అదే తల తో నడుస్తే వాకిలికూడా దాటలేమని ఖచ్చితంగా చెప్పటం ఇక్కడ గమనించాల్సిన విషయం.

ముగింపు

      సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు. ఇవి ఎక్కడా వ్రాసి ఉండకపోవటంతో సామెతలలో అనేకమార్పులు వస్తాయి. ఇవి అనేక మోస్తర్లు- ఒక అంశం మరొక అంశం చేతా, సామ్యభేధాల వల్లా, వృద్ధి చేయబడీ, కొంత విడిచి వేయబడీ, ఇంకా అనేక మోస్తర్లుగా అనేక మార్పులు వస్తాయి. వాటన్నింటినీ అర్థం చేసుకొని, ఆచరణలో పెట్టడమే మన కర్తవ్యం.

    

హాహాహూహూ నవలా సమీక్ష

భారతీయ సంస్కృతీ విలువలు, దైవ భాష సంస్కృతం యొక్క ప్రాధాన్యతను బహు చక్కగా వివరించిన నవల ఇది.

పరిచయం:

ఈ నవల 1952 లో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణచే రచించబడింది. 1982లో ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ధారావాహికగా వచ్చింది. గ్రంథకర్త కుమారుడు, నవల సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి. విశ్వనాథునివి మొత్తం 118 రచనలు. అందులో 57 నవలలు.

సంక్షిప్త కథ:

లండనులో ట్రిఫాల్గార్ స్క్వేర్ వద్ద గుర్రం మనిషి శరీరంతో వింత జంతువు కనిపిస్తుంది. చేతి కడియం ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న ఆ విచిత్ర జీవి స్పృహలో ఉండదు. దీనిని బందీఖానాలో ఉంచి దానిపై వివిధ రకాల శాస్త్రీయ పరమైన ప్రయోగాలు చేద్దామని కొందరు అనుకున్నారు. కానీ అవన్నీ ఫలితం లేకుండా పోతాయి. ఈ వింత జంతువును ప్రజలు హా హా హూ హూ అని పిలుస్తారు. ఈ హా హా హూ హూ మాట్లాడుతుంటే స్పష్టంగా అర్థం కావాలి అంటే చాలా దూరానికి వెళ్ళాలి కానీ దాని దగ్గరలో నిలబడితే గోలగా అరిచినట్లు అనిపిస్తుంది. పైగా హా హా హూ హూ మాట్లాడే భాష సంస్కృతం.

ఈ వింత జంతువు గురించి ప్రపంచం నలుమూలలకు తెలుస్తుంది. వివిధ దేశాల నుండి భాషాశాస్త్రవేత్తలు జంతు శాస్త్రవేత్తలు వచ్చి ఆ వింత జంతువు పై పరిశోధనలు చేయడానికి ప్రయత్నిస్తారు. వీరందరికీ చమత్కారమైన మాటలతో సమాధానం చెప్పి వెనుదిరిగే లా హా హా హూ హూ చేస్తుంది . ఉదాహరణకు భాష జంతు శాస్త్రవేత్తలు ఇద్దరూ ఆ మృగము యొక్క మెదడును ముఖకవళికలను పరీక్షించుటకు తన మెదడును శస్త్రచికిత్స చేసి పరిశీలిస్తామని అనుమతి అడుగుతారు. అప్పుడు ఆ మృగం గట్టిగా నవ్వి మీకు ఈ చిలిపి ఆలోచనలు ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు దీనిని తెలుసుకొనుటకు నేను మీ పై పరిశోధన చేయవచ్చా అని అడిగింది అంతే ఈ ఒక్క ప్రశ్న తో వాళ్ళు వెనుదిరిగారు.

నిజానికి అది మృగం కాదు ఒక గంధర్వుడు ప్రతి రోజూ ధ్యానం లో ఉండేవాడు ఆహారం తీసుకునే వాడు కానీ విసర్జన లేదు కళ్ళు తెరిచి నోరు తెరిచి మాట్లాడగలడు కానీ హృదయ స్పందన స్పందన శ్వాస లేవు. చాలాసార్లు ఈ గంధర్వుడి పై పరిశోధనలు చేయడానికి నానారకాలుగా ప్రయత్నాలు చేశారు. ఒకసారి తుపాకీ లో గుళ్లను ఈ గంధర్వుడి శరీరం లోకి చొచ్చుకు పోయేలా చేశారు కానీ అవి అతని ని ఏమి చేయలేదు అతనిని తాకగానే కింద పడి పోవడం లేదా నేరుగా వెనక్కి వెళ్లిపోవడం జరుగుతుండేది.

చివరకు ఈయన మృగం కాదు మంచి జ్ఞానం గల వ్యక్తి అని ఆ దేశ అతిథి గృహానికి పంపించి అతిథి మర్యాదలు చేశారు. చివరకు ఒక చేతిలో వీణ ను పట్టుకొని వాయిస్తూ నెమ్మదిగా ఆకాశం వైపు పయనం సాగించాడు.

వర్ణనలు మరియు ముఖ్య సన్నివేశ మాటలు:

1. గంధర్వుడి పై ఉన్న వస్త్రాన్ని పరీక్షించి అంతటి సుకుమారమైన వస్త్రం ఏ దేశంలో చేశారో తెలియదు కానీ డక్కా మజిలీన్లు అని చెప్పుకుంటారు ఏవైనా అంత సన్నగా ఉంటాయో లేదో అని వర్ణించారు 

2. యూరోపియన్లు మాట్లాడే సంస్కృతం కొంత భిన్నంగా ఉంది గంధర్వుడు మాట్లాడే సంస్కృతం ఏ గ్రంథంలో ను ఎవరు మాట్లాడలేని స్పష్టమైన సంస్కృతం.‌ యూరోపియన్లు ఆస్తికళా అనవల్సి వస్తె ఆ ను వ వలె ఉచ్చరించి,స ను షా చేసి లా ను ళా గా ఉచ్చరిస్తారు. దీర్ఘం ఉన్న చోట హ్రస్వమూ హ్రస్వమున్న చోట దీర్ఘమూ ఉచ్చరిస్తారు. నారాయణః అనుటకు నరయనాః అంటారు.‌ ఇక్కడ రచయిత సంస్కృతభాష యొక్క ప్రాధాన్యతను తెలియజేశాడు.

3. మనుషులకు దంత్యములు తాలవ్యములు ఆ అవయవాల పరిమాణం ఉచ్చరించబడేవి విధంగా ఏర్పడి ఉంటాయి ఇవి జంతువులకు ఉండవు కావున మాట్లాడలేవు. ఈ వాక్యం ద్వారా మాటలు ఎలా మాట్లాడగలము అన్న విషయాన్ని బహు చక్కగా వివరించారు.

4. శబ్దోఛ్ఛారణ జరగాలంటే అభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నం రెండు జరగాలి అందులో స్పష్టములు ఈషత్పష్టములు ఇది మనుషుల జ్ఞానం తో కూడిన వ్యవహారం.

5 ఏ శబ్దం ఉచ్చరించే ఎందుకు ఎంత గాలి మనం నా దగ్గర నుంచి పుట్టించాలి అది కంఠంలో ఎంత ముఖంలో కి ఇచ్చిన గాలి తాలువులకో దంతాలకో ఎక్కువ తగిలించాలో తక్కువ తగిలించాలో ఇదంతా మన మెదడులో ఉన్న జ్ఞానాన్ని బట్టి మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. వీటినే సంస్కృత వయీకరణలు స్పృష్టమనీ,ఈశాతప్రుష్టమని సంవాదం అని వివాదం అని అంటారు బాహ్యాభ్యంతర ప్రయత్నాలు తల్వాది స్థానాన్ని బాహ్య ప్రయత్నం అంటారు.

6. పండితులకు భాష శాస్త్రవేత్తలకు మధ్య సంభాషణ ఈ క్రింది విధంగా జరిగింది.

భాష పశువు శాస్త్రవేత్తలు గంధర్వుడికి శస్త్రచికిత్స చేసి పరిశోధన చేయాలనుకుంటారు అప్పుడు పండితులు, 'ఆయన అట్ల మాట్లాడుతుంటే ఆయన ముఖ్య అవయవాలూ మాట్లాడేందుకు అనుగుణంగా ఉన్నాయనే గా అటువంటి జ్ఞానం ఉండేందుకు ఆ మెదడు ఉన్న పదార్థం అనువైనదని కదా ఈ విషయం సామాన్యమైన జ్ఞానమునకు అనుమీయవుతుండగ(ఊహించదగినది) మీరు ఇంత పరిశోధన చేయాలి అనడం బాగాలేదు.'‌ అప్పుడు భాషా శాస్త్రవేత్త, ' మేము పరిశోధిస్తాము అన్నది ఆ విషయం కాదు ఆయన వదనంలో అవయవాలు మనుష్య ముఖా అవయవాల కన్నా భిన్నంగా ఉండి ఆ శబ్దములు ఉచ్చరించబదుతున్నవేమో అన్న విషయం. మీకు మాకు ప్రధాన విషయాలలో కొంత భేదం ఉంది మీరు ప్రతిదీ ఊహించి అంటారు మేము ప్రయోగం చేసి చూడవలెనంటాము ఊహ యదార్థము కాకపోవచ్చు కానీ మా పరిశోధన ఎప్పుడు యధార్థం అవుతుంది' అపుడు పండితుడు, 'మేము ఊహిస్తామంటే వెర్రి మొర్రి గా ఊహించము గదా ఒక హేతువులు పురస్కరించుకుని ఊహిస్తాము.' దీని ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటంటే పండితులకు శాస్త్రవేత్తలకు మధ్య గల వ్యత్యాసం, వారి దగ్గర ఉన్న విద్య ఎటువంటిదో ఎవరికి ఉపయోగపడుతుందో అనే ఈ విషయాన్ని తెలియజేసే విధంగా ఉంది.

7. పండితులు హా హూ తో మా దేశాలలో విషయం తెలుసుకుందాం అన్న జిజ్ఞాస ఎక్కువ మా దేశస్తులు ఇతర ఖండాలకు పోయి అక్కడ ఉన్న వింతలు విశేషాల గురించి వ్రాస్తుంటారు అని అన్నప్పుడు ఆ గంధర్వుడు ఇలా సమాధానం ఇస్తాడు ఎందుకు పనిచేయడం సృష్టి విభిన్నమైనదని మీకు తెలియదా సృష్టిలో వివిధ రకాల జంతువులు జాతులు ఉన్నాయి వాటికి వేరు వేరు అలవాట్లు వేరు వేరు జీవన విధానం ఉంటుంది మొట్టమొదట కొత్త మృగాలను కొత్త జాతుల ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అది అజ్ఞానం యొక్క లక్షణం. శాస్త్ర పరిజ్ఞానం కలిగిన తర్వాత బుద్ధి పరిపక్వం అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమీ ఉండదు పైగా మనం ఒక విషయం గురించి తెలుసుకుంటే దానిని అనేక రకాలుగా ఊహించవచ్చు తర్వాత దానిని ప్రత్యక్షంగా చూస్తే ఆశ్చర్యం ఏమీ ఉండదు మీరు ఆలోచించి మనస్సును ఏకాగ్రం గా ఉంచి విషయముల యొక్క యధార్థం తెలుసుకోలేరల్లే ఉంది.

8. ఒకసారి బిషప్ అనే క్రైస్తవ పాస్టర్ హూహూ తో ఇలా అంటాడు మీ మతం ఏమిటి? దేవుని కుమారుడు క్రీస్తు. మనం ఆయనను నమ్మితే గాని భక్తి లేదు అని. అప్పుడు హూహూ ఇలా సమాధానం ఇస్తాడు సామాన్యులకు మతము లేదు. ఒకానొక మహర్షి చెప్పిన మతము నందు ఒకనికి విశ్వాసం ఉంటుంది. అల్పుని విశ్వాసం అల్పమైంది. అధికుని విశ్వాసం అధికమైంది. ఏ లోకం లో అయినా ప్రాణులందరూ వాంచాదూషితులు. వాంచాతీతుడై బ్రహ్మ పదాన్ని ఎవడు సేవిస్తాడో వాడికి అల్పమైన ఇట్లాంటి వాటితో అవసరం లేదు. మతం అంటే ఏమిటో ఎవరికి తెలుస్తుంది? మొట్టమొదట లోకము యొక్క తెలి నశ్వరత్వం తెలిస్తే చాలు. ఈ మాటల్లో తాత్విక భావన ఉట్టిపడేలా మోక్ష ప్రాప్తి కొరకు చేయాల్సిన కృషి ని గురించి చక్కగా వివరించారు.

9. చిన్న చేప చిన్న చెరువులో ఉంటుంది. పెద్ద చేప పెద్ద చెరువు లో ఉంటుంది. తిమింగలం సముద్రంలో ఉంటుంది. అంతే కానీ చిన్న చెరువులో మంచినీళ్లలో ఉండే చేపను సముద్రంలో వేస్తే చస్తుంది అలాగే మన శరీరాలు మన సంస్కారానికి అనుగుణంగా ఉంటాయి. మనము ఉన్న దేశాన్ని శరీరాన్ని మన పూర్వీకుల ఆచరణని బట్టి ఉంటుంది ఇది గాఢమైన బంధం. ఈ మాటలు గంధర్వుడు పాశ్చాత్య పండితులతో అంటుంటాడు ఈ మాటల్లో స్వదేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని విడిచి పెట్టినట్లయితే ఎటువంటి కష్టాలు ఎదురవుతాయి అన్న విషయాన్ని ఈ చిన్న ఉదాహరణ ద్వారా అద్భుతంగా వివరించారు.

10. తెలుసుకోవాల్సిన విషయాలు ఎక్కువ పోగు చేస్తాననడం కన్నా ఒక్క విషయం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కృతార్థత ఎక్కువ.

నవల పై నా అభిప్రాయం:

మనుషుల యొక్క చిలిపి చేష్టలను గురించి గంధర్వుడి చేత కవి చెప్పకనే చెప్పించాడు. భారతీయ సంస్కృతి విలువల గురించి జనని భాష సంస్కృత ప్రాధాన్యత గురించి అద్భుతంగా వివరించారు. 

ఇది రెండు మూడు గంటల్లో చదవగల చిన్న నవల. చదువుతున్నకొద్దీ ఆసక్తి తెప్పిస్తూ, ఎన్నో తాత్విక భావాలను ఇనుమడింప చేసిన నవల.

27, ఏప్రిల్ 2021, మంగళవారం

మా బాబు నవలా సమీక్ష

  ఈ కథ మొత్తం 'నేను' అని చెబుతూ కవి ఉత్తమ పురుష కథనం లో రాశాడు. ఇందులోని ఏ ఒక్క పాత్రకు పేరు ఉండదు. అన్ని పాత్రలను సంబంధాలతో కలుపుతూ రచన సాగుతుంది. ఉదాహరణకు నేను, మా పిన్నమ్మ, మా తమ్ముళ్ళు, మా బాబు మొదలైనవి.

పరిచయం:

ఈ నవల వేయిపడగలు కంటే ముందే 1935లో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణచే రచించబడింది. దీని కృతిభర్త  శ్రీ ఉయ్యూరు కుమార రాజా, ఎం ఆర్ అప్పారావు.

సంక్షిప్త కథ:

   ఒక తల్లి పిల్లవాడికి జన్మనిస్తూ మరణిస్తుంది ఆ పిల్లవాడు తన పిన తల్లి సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆ పిల్లవాడిని తక్కువ చేసి చూడటం లాంటివి చేస్తూ ఉండేవారు కానీ తన పినతల్లి మాత్రం జాగ్రత్తగా పెంచేది అయినా ఆ ఇంట్లో ఆమెకు అంత విలువ లేకపోయేది ఆ పిల్లవాడికి ఆరు ఏడు సంవత్సరాలు వచ్చేసరికి వాడి చే పాలేరు పని చేయించడం మొదలు పెట్టారు. ఈ పని భారాన్ని తట్టుకోలేక ఇల్లు విడిచి వెళ్లిపోయాడు.

   రాత్రి పగలు చాలా దూరం నడుస్తూ ప్రయాణం చేశాడు ఒక రాత్రి అడవిలో పాములు పట్టే వాళ్ళు ఈ పిల్ల వాడిని చూసి మచ్చిక చేసుకోవాలని అనుకుంటారు. కానీ వాళ్ల దగ్గర నుండి ఎలాగోలా తప్పించుకుని బయటపడి ఒక ఊరు చేరుతాడు. ఆ ఊర్లో జనాలందరూ వీడిని పాములవాడు అని నానా బాధలు పెడతారు. కానీ ఒక పెద్దాయన మాత్రం వాడిని చేరదీసి తన ఇంట్లో పెంచుకుంటాడు. అక్కడే ఈ పిల్లవాడు యువకుడు గా ఎదుగుతాడు. ఈ పిల్లవాడు ఆయనను బాబు అని పిలుస్తూ ఉండేవాడు. (ఈ విధంగా ఈ నవల శీర్షిక మా బాబు అయింది)

   కొన్ని రోజులకు ఆ పెద్దాయన ఇంటి వ్యవహారం అంతా ఈ యువకుడికి తెలుస్తుంది. యువకుడిని ఆ బాబు తన పెద్ద కొడుకు లా పెంచుతాడు కొన్ని రోజులకు ఆ పెద్దమనిషి మరణిస్తాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంది. వీరి మరణవార్త తెలిసిన ఆ పెద్దాయన యొక్క బావమరిది వీళ్ళ ఇంటికి వచ్చి తిష్ట వేస్తాడు. వాళ్ళ ఆస్తంతా కాజేసుకుంటాడు ఈ యువకుడు మాత్రం ఏమి చేయలేడు. పిల్లలకూ ఏమీ తెలియదు. కానీ ఆ బాబు వీడికి చేసిన సహాయం వల్ల ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే ఆయన రుణం తీర్చిన వాడినవుతాను. అనుకుంటాడు కానీ ఏమీ చేయలేక రోడ్డున పడతాడు.

       అక్కడి నుండి మళ్ళీ నడుస్తూ నడుస్తూ ఒక ఊరు చేరుతాడు. ఆ ఊర్లో ఒక తల్లి పరిచయమై తన అమ్మ లాగా ఆకలి తీరుస్తుంది. కానీ ఆ ఇంట్లో ఉండటం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి మళ్లీ రోడ్డున పడతాడు.

     మళ్ళీ నడుస్తూ నడుస్తూ ఒక ఊరు చేరుతాడు. అది వాళ్ళ మేనత్త గారి ఊరు. మేనమామ చనిపోవడంతో మేనత్త ఒక్కతే కష్టపడుతోంది. దానిని గ్రహించిన ఈ యువకుడు ఆ ఇంటి వ్యవహారమంతా చక్కదిద్దుతాడు. కొన్నాళ్ళు గడిచాక వాళ్ళ అత్త చనిపోతుంది. ఇప్పుడు ఆ పిల్లల బరువు బాధ్యతలు మీద పడ్డాయి. ఈ పనుల్లో చాలా బిజీగా ఉండగా ఒకరోజు బాబు కలలో కనబడి,'నా పిల్లల సంగతి ఏంటి' అనే గుర్తు చేస్తాడు. అప్పుడు ఈ యువకుడు ఆ బాబు చేసిన మేలుని గుర్తు తెచ్చుకొని, వాళ్ల ఊరికి పయనమవుతాడు.

     బాబు గారి ఊర్లో బాబు బావ మరిది బాబు కొడుకులను, కూతురునీ నానా కష్టాలు పెడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఈ యువకుడు అక్కడికి వెళ్లి వాళ్ళని చేరదీసి ఈయన వెంట తెచ్చుకుంటాడు. ఇప్పుడు బాబు గారి కొడుకులను కూతురు ని, మేనత్త కొడుకులను కూతురుని పోషించాలి. కాబట్టి వాళ్లకు చదువు చెప్పడానికి గుంటూరు పంపిస్తాడు.

     చివరికి ఆ యువకుడి మంచితనాన్ని, కష్టాన్ని గ్రహించిన ఆ పాములవాడు ఏదో ఒక సహాయం చేయాలనుకుని బాబు గారి బావమరిది అస్వస్థతకు గురయ్యేలా చేస్తాడు. ఆయన చనిపోతాడు.

  యువకుడు బాబు గారి పెద్ద కొడుకుకు తన మేనత్త కూతురును ఇచ్చి వివాహం జరిపిస్తాడు. తర్వాత బాబు గారి కూతురుని ఆ ఊర్లో ఒక రెండు రోజులు బస చేసిన పిన్నమ్మ గారి కొడుకుకు ఇచ్చి వివాహం చేస్తాడు.

    బాబు గారి కొడుకుకీ మరదలు కి పుట్టిన మగ పిల్లవాడు మళ్ళీ బాబుగా జన్మించాడని సంతోషించి, బాబు తో ఆడటం మొదలు పెట్టడంతో కథ సమాప్తం అవుతుంది.

వివిధ పాత్రల మనస్తత్వాలు (ముఖ్యమైనవి మాత్రమే):

1. నేను (ఉత్తమ పురుషలో ఉంది): 

చిన్నప్పటి నుండి నానా కష్టాలు పడుతూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని బాధలకు గురైనా బ్రతకడానికి ఏదో ఒక మార్గాన్ని వెతుక్కుంటూ పోయాడు. అందులో హింసించే వాళ్ళు కొందరు. మంచిగా చూసుకునే వాళ్ళు కొందరు. ఏ ఆధారమూ లేకుండా ఎన్నో ప్రదేశాలు మారుతూ ఎన్నో ఊళ్లు తిరుగుతూ స్థిరపడి మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావంతో వారికి ఏదో విధంగా సహాయం చేస్తూ జీవనం గడిపాడు. ఎన్ని ఆటంకాలొచ్చినా కుంగిపోకూడదు అన్న విషయాన్ని ఈ పాత్ర ద్వారా గ్రహించాలి.

2. బాబు :

ఈయన ఎంతోమందికి సహాయం చేస్తూ మంచి మనిషిగా ఎదిగిన వ్యక్తి. ఈ కథలో కథానాయకుడు ఇతడే. ఆ యువకుడిని రెండు సంవత్సరాలు మాత్రమే పోషించాడు. తన పెద్ద కొడుకులా చూసుకున్నాడు. ప్రతిఫలంగా ఆ యువకుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశాడు.

3. బాబు బామ్మర్ది: 

బాబు ఆస్తినంతా కాజేశాడు. బాబు పిల్లలతో వెట్టిచాకిరీ చేయించుకోవడం వంటివి చేశాడు చివరకు ఏమి తీసుకుపోక పాములవాడి చేతిలో మరణించాడు.

4. పాములవాడు: 

అడవిలో యువకుడిని పట్టుకున్నందుకు వాడు పాముల వాడికి బుద్ధి చెప్పాడు. తద్వారా ఆ యువకుడి పట్ల కృతజ్ఞతా భావంతో రుణపడి ఉంటాడు. ఏదోవిధంగా రుణం తీర్చుకోవాలని తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ యువకుడికి ద్రోహం చేసిన బాబు యొక్క బామ్మర్ది ను నేలపాలు చేస్తాడు. దొంగతనాలు చేసే స్థాయి నుండి సహాయ గుణం కలిగిన వ్యక్తిగా మార్పు చెందుతాడు.

5. పిన్నమ్మ:

బాబు గారి కూతురు మతిస్థిమితం లేని పిల్ల అని తెలిసి కూడా తన కొడుకుకు ఇచ్చి పెళ్లి జరిపించుకుంటుంది. ఈమెకు ఆ యువకుడి పట్ల ఎంత జాలి ఉంది అన్న విషయాన్ని ఈ సంఘటన ద్వారా కవి వర్ణించాడు.

6. కుశలమ్మ:

ఈ నవలలో పేరు ఉన్న ఏకైక పాత్ర. ఈమె ఒక ముసలావిడ. పిల్లలందరూ గుంటూరులో చదువుతున్నప్పుడు ఈమె వంట మనిషి గా ఉంటుంది. ఈమెకు సంతానం లేదు. క్రమంగా ఈమెను కూడా యువకుడే పోషించాల్సి వస్తుంది. ఇంటికి తీసుకుని వచ్చి పోషిస్తాడు.


నవలలో ఆకట్టుకునే వాక్యాలు:

1. 'రాతి లోని కప్ప కు ఆహారం ఏర్పాటు చేసే భగవంతుడు నాకు కూడా అలా చేయకుండా ఉంటాడా' ఈ వాక్యం కష్టాల పాలు అవుతున్న ఆ యువకుడికి ఆత్మస్థైర్యాన్ని నింపుకునేలా ఉంది.

2. 'ఆపదలో ఉన్నంత బుద్ధి ఆపద పోయిన తర్వాత మనుషులకు ఉండదు. మనుషులు పశువులు వాడు లేనప్పుడు గడ్డి తింటాడు తర్వాత పాయసం తిన్నాననుకుంటాడు వాడు పశువు!' ఈ మాటలు మేనత్తకు ఆ యువకుడికీ మధ్య జరిగిన సంభాషణ. మేనత్త తన కూతురికి జబ్బు చేయటంతో తిరుపతికి వస్తానని మొక్కుకుంటే  కొన్ని రోజులకు మర్చిపోతుంది.  ఒక రోజు ఆంబోతు పొడవడానికి రాగా గుర్తుకు వస్తుంది ఆ సందర్భంలో ఈ మాటలు అనుకుంటారు.

3. 'కోపం అహంకారం నుంచి పుడుతుంది అహంకారం జరుగుబాటు లోంచి కలుగుతుంది. జరుగుబాటు మూలంగా మనసుకి సుఖం అలవాటవుతుంది ఆ సుఖానికి కొంచెం వ్యతిరేకం జరగడం తోనే కోపం వస్తుంది' ఈ మాటలు యువకుడికి ఒకసారి కోపం వచ్చినప్పుడు తనలో తాను అనుకున్నాడు.

4. 'జాలి అంటే మనం కష్టపడుతున్నామని దుఖపడుతున్నామని ఎదుటి వాళ్లకు మన మీద కలిగే ఒక మెత్తని మనసు. ప్రేమ అంటే మన అందం, మన భావం లో ఉండే గుణాలు, దోషాలు అన్ని కలిసి అవతల వాళ్ళకి ఇష్టమై మన జీవితమంతా వాళ్ళ జీవితం తో కలిసి పోవాలని కలిగే ఒక మనసు.' ఈ మాటలు ఆ యువకుడు తన మరదలు ను చూసినప్పుడు తనలో తాను అనుకున్నాడు.

నవల పై నా అభిప్రాయం:

మా బాబు అని నేను మొదట విన్నప్పుడు ఏ చిన్న పిల్లవాడి గురించిన కథనో అనుకున్నాను. కానీ తెలిసిందేమిటంటే ఈ బాబు పిల్లవాడు కాదు గొప్ప సహాయ గుణం కలిగిన పెద్ద మనిషి అనీ, ఇందులోని కథానాయకుడు ఇతడేనని.

ఈ నవల చదివింప చేసే గుణం కలది. తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తి ప్రతి పేజీ చదువుతున్నప్పుడు కలిగింది. కష్టాలు కన్నీళ్ల తో మొదలైన ఈ కథ తర్వాతి పేజీలో ఇంకెంత దుఃఖం చూడాల్సి వస్తుందో అన్న అనుమానం కలిగింది. నవలలోని కొన్ని పాత్రల గురించి చదువుతుంటే ఆ కష్టాలు పగవాడికి కూడా రావద్దు అనే భావన కలిగింది. కొన్ని పాత్రల గురించి చదువుతుంటే ఆ పాత్రలను కొట్టాలనిపించేంత కోపమూ కలిగింది. మొత్తానికి నవల మొత్తము ఆనాటి సమాజాన్ని వర్ణింప చేసే విధంగా కరుణ రస ప్రాధాన్యం కలిగి ఉంది.

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...