11, మే 2021, మంగళవారం

గడిచిన జ్ఞాపకాలు (కవిత)

ఏమి వెతుకుతున్నావూ


మూసిన నీ పుస్తకాన్ని


చెరిగిన పాదముల చిహ్నాల కోసం


ఒంటరిగా కూర్చుండి


కదిలే గాలికి కబళమునిస్తున్నావ


వనము వంటి వసతిగీములో


నివాసముంటూ


పదికి లేచినా సరిపోని నిద్రను మింగి


వంట కోసం వంతులేయడం


నీటి కోసం కాటికెళ్ళడం


పర్యాప్తించిన పేస్టును పిండుతూ


పాసిన పళ్ళను తోముతూ


నీటితో జలకాలాడటం


అరిగిపోయిన సబ్బుతో


అభ్యంజనమాచరించి


అనిగి మనిగి అరకొర కూరలను


ఆరగించి ఆనందమొంది


అడ్జెస్టు చేసుకొన్న జీవితాన్నా


నీవు నెమరేస్తున్నది


ప్రార్థనలో అడుగిడ కుండా


తరగతి ని తరగతి కి అప్పజెప్పి


తరువుల కింద తందానలాడుతు


సాగించిన సంభాషణలో


సారాంశం ఏముంది


అన్నదాన లైను లో


ప్లేటు పట్టి పాకులాడిన వైనం


వడి వడి గా


తెచ్చి తాగిన వైను వైనం


కౌముది వెలుగులో


నిశీధి నిశ లో


సీసాలు బద్దలు కొట్టిన జ్ఞాపకం


ఒక జ్ఞాపకమేనా


టిపి లలో టీచర్ల మై


నిండని కడుపుతో


మాడుతున్న కళ్ళతో


కర్రపట్టుకు పోజులిస్తిమి


దీనికి ప్రయోజనం లేదని


తెలిస్తే మాత్రం ప్రయోజనమేమిటి


భయంకర హాస్టల్లో


ఒకడు కునుకు తీస్తాడు


ఒకడు బాతాఖానీ కొడతాడు


ఒకడికి ఏడుపుకి నవ్వొస్తుంది


ఒకడి నవ్వు ఏడుపు తెప్పిస్తుంది


జడిగొల్పే ఈ దుఃఖానికి


తడవకుండా గొడుగు వెతుకుతున్నావా


గడిచిన రెండేళ్లూ


మేఘాన్ని చూస్తూ


కాలాన్ని మరిచాం


కర్పూరం లాంటి


కాలం కాలుతూ పోయింది


సర్టిఫికెట్ సిగరి చేతిలో పడింది


లాక్ డౌన్ ఎడారి లో


కాళ్ళు తెగిన ఒంటరి ఒంటె లాగా


వీధి చివర్లో


కొంగ జపం చేస్తూ


డైటు ను నెమరేస్తున్నావా


గడిచిన జ్ఞాపకాలను వెతుకుతున్నావా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...