23, ఆగస్టు 2021, సోమవారం

వీర వల్లడు నవలా సమీక్ష

వీరవల్లడు అనే పుస్తకం 62 పేజీలతో 19వ శతాబ్దం చివరి కాలాన్ని ప్రతిబింబింప చేసే  ఒక చిన్న  సాంఘిక నవల. పూర్వ కాలపు కట్టుబాట్లనూ, అప్పటి సంస్కృతీ, సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు ఇందులో వివరించారు. యజమానికీ, పాలేరుకీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ నవల వివరిస్తుంది. ముఖ్యంగా ఇందులో కృతజ్ఞతా భావాన్ని 'వల్లడు' అనే ప్రధాన పాత్ర ద్వారా రచయిత చక్కగా వివరించారు. నేడు మనుషుల మధ్య లోపించిన ఈ భావాన్ని తిరిగి సాధించేందుకు తప్పకుండా చదవాల్సిన, నవల ఇది.

కవి పరిచయం:

ఈ నవలను కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 1935-40 ప్రాంతాల్లో రచించారు. ఈయన పేరు వినగానే మనకు గుర్తొచ్చే మరో ప్రసిద్ధ రచన వేయిపడగలు. దీన్ని పి.వి. నరసింహారావు గారు సహస్రఫణ్ పేరుతో హిందీలోకి అనువదించారు. ఈయన మరో రచన శ్రీమద్రామాయణ కల్పవృక్షం దీనికి గానూ సాహిత్య ప్రక్రియల్లో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం అయిన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగా విశ్వనాథ గారు ప్రసిద్ధి చెందారు.

పాత్ర చిత్రణ:

ఈ నవలలో పాత్ర చిత్రణ అద్భుతంగా వుంటుంది. ఒక్క వల్లడి పాత్రే కాదు. కరణము, మునుసబు, సాయిబు, దొర, దొర భార్య సర్వలక్షమ్మ గారు, చిన్నపిల్లలు – ఇలా నవలలోని మొత్తం అన్ని పాత్రలూ కళ్ళకి కట్టినట్లుగా వుంటాయి. ఇందులో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే వల్లడి దొర పాత్రకు పేరు లేదు. నవల ప్రారంభం నుండి చివరి దాకా వల్లడి దొర అనీ ప్రస్తావిస్తూ ఉంది.

నేపథ్యం:

విశ్వనాథ వారి కుటుంబంలో ఆయనకు రెండు, మూడు తరాల క్రితం జరిగిన వాస్తవ సంఘటనలకు కథారూపమే ఈ నవల అని విశ్వనాథ పావనశాస్త్రి చెప్పుకున్నారు. ఈ నవలను గొర్రెపాటి బాలకృష్ణమ్మకు అంకితం ఇచ్చారు.

ఇతివృత్తం:

పట్టణ వాసపు చదువుల్లో చేరిన ఓ పల్లెటూరి బ్రాహ్మణ బాలుడికి పాఠశాలలో మాస్టారు వల్లప్ప అనే తన పేరును వెక్కిరించగా తన పేరంటేనే విరక్తి ఏర్పడుతుంది. సెలవుల్లో ఇంటికి వచ్చినపుడు  తన పేరు మార్చమని తన తండ్రికి చెప్పగా వల్లడనే పాలేరు పేరు పెట్టామనీ అది గొప్ప పేరనీ తండ్రి చెప్తే అతనికి పేరు మార్చుకోవాలని ఇంకా పట్టుదల పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తన చిన్నతనంలో వల్లని గురించి దాదాపు ఇదే పరిస్థితుల్లో విన్న కథను ఆయన కొడుక్కి చెప్తాడు. తన దొర మరణానంతరం ఆయన కుటుంబానికి ఆస్తి దక్కకుండా చేసిన దొర బాబాయిని ఒంటరిగా ఎదిరించి, నేర్పుగా వ్యవహారాన్ని చక్కబెట్టి ఎలా ఆస్తి తిరిగి రప్పించాడన్నదే వల్లడి కథ. పందొమ్మిదవ శతాబ్ది తొలినాళ్ళలోని భూవ్యవహారాలు, ఆనాటి కులకట్టుబాట్ల మధ్య ఈ కథను రచయిత నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.

సంక్షిప్త కథ:

వల్లడు ఒక మాల కులానికి చెందిన పాలేరు.  అతని దొర ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి పూర్వులలో ఒకాయన ఒక అడవిలాంటి ప్రదేశాన్ని చూసి, అది మంచి ప్రదేశమని గుర్తించి, దానిని ఊరుగా మార్చి అక్కడ నివసించాలని నిర్ణయించుకుంటాడు. మొదట అక్కడ తను ఒక పాక వేసుకుని భార్యా పిల్లలతో కాపురం పెడతాడు.

ఆ తర్వాత ఒక రోజు ఆ దారిన పోతున్న వల్లడి పూర్వీకుడు ఆకలితో ఆ పాక దగ్గరికి వస్తే అతనికి ఆ బ్రాహ్మణుడు అన్నం పెడతాడు. ఆ బ్రాహ్మణుడు తన నిర్ణయం అతనితో చెప్పి “నాకు సాయంగా వస్తావా?” అని అడుగుతాడు. ఒక పూట అన్నం పెట్టాడన్న కృతజ్ఞతతో వల్లడి పూర్వీకుడు జీవితమంతా ఆయన దగ్గర ఉండడానికి సిద్ధమై భార్యా పిల్లలని తీసుకుని వచ్చేస్తాడు.

ఆ తర్వాత కమ్మవారినీ, ఇతర కులాల వారినీ తీసుకొచ్చి వాళ్ళకి భాగాలు పెట్టి అడవంతా కొట్టి దాన్నొక ఊరుగా తయారు చేస్తారు. అప్పటి నుండి వల్లడి వంశం వారు , ఆ బ్రాహ్మణుడికి తరతరాలుగా పాలేరు పని చేస్తూ వస్తారు. 

వల్లడి దొర కుటుంబానికి సంబంధించిన పొలం ఉమ్మడిగా వుంటుంది. ప్రతితరం లోనూ పెద్ద కొడుకు సంతానానిదే అధికారం కనుక ఆ లెక్క ప్రకారం వల్లడి దొరదే పెత్తనం కావాలి. కానీ వరుసకి బాబాయి అయిన ఒక పెద్దాయన రాయుడుగారు వుండడం వలన వల్లడి దొర ఆయనకి గౌరవమిచ్చి ఆయన పేరు మీదగానే అంతా నడిపిస్తూ వుంటాడు. అయినా ఆ రాయుడుగారికి మనసులో కొంత అసంతృప్తి వుంటుంది.

హటాత్తుగా దొర చనిపోవడంతో రాయుడుగారు పెత్తనమంతా తన చేతిలోకి తీసుకుని, వల్లడి దొర పెళ్ళాం పిల్లల గురించి పట్టించుకోవడం మానేస్తాడు. ఊర్లో పెద్దలందరినీ తనవైపు తిప్పుకుని పొలం మొత్తం తానే అనుభవించాలనుకుంటాడు. తిండికి జరగని పరిస్థితులలో ఆవిడ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆవిడ అన్నదమ్ములూ రాయుడుగారిని ఎదుర్కునేంత శక్తి లేక చేతులు ముడుచుకు కూర్చుంటారు. అయితే పాలేరు వల్లడు అలా ఊరుకోలేకపోతాడు. ఆవిడని మళ్ళీ ఊరికి తీసుకు వచ్చి ఆవిడ ఆస్తి ఆవిడకీ, ఆవిడ పిల్లలకీ దక్కేలా చేస్తాడు.

శైలి:

కథాప్రారంభ ఘట్టాల్లోని కథాకాలానికి వల్లని కథలోని కథాకాలానికి రెండు తరాల అంతరం ఉంటుంది. రచయిత ఆయా ఘట్టాల్లోని పాత్రల భాషలో చక్కని సూక్ష్మమైన బేధం  చూపించారు. నవలలో ఆనాటి గ్రామ వ్యవహారం ఎలా ఉంది అనేది కళ్ళకు కట్టినట్టు చక్కగా వివరించారు.

ఉదాహరణ సన్నివేశాలు:

1. "వల్లడు అన్న పేరు చాలా మంచి పేరు. ఒక్కొక్క పేరు - ఒక్కొక్క విధంగా మంచిదోయి. కృష్ణుడు అన్న పేరుందనుకో ఆ పేరు మంచిది కాదని ఎవరూ అనరు కదా! ఎందుకు అనరు? కృష్ణుడు గొప్ప పనులు చేశాడు గనుక. ఆపేరు అందరికీ మంచిది అనిపిస్తుంది." - పేరు మార్చమని అడిగిన వల్లడికి అతడి తండ్రి  చెబుతున్న మాటలివి. పేరు గురించి, పేరు ప్రాధాన్యత గురించి ఈ మాటల్లో రచయిత వివరించారు. మన పేరును మనం ఎప్పుడూ చులకన భావంతో, తక్కువచ్చేసి చూడరాదు అన్న విషయాన్ని ఈ మాటల ద్వారా గ్రహించవచ్చు.

2. "ఊరు మీద ఊరు పడ్డా కరణం మీద కాసు పడదు, ఎదుటి వాడి మేలు ఓర్వకపోతే మన సరదా మంటగలుస్తుంది, " -  ఈ మాటలు గ్రామ కరణం తో రంగమ్మ  అనే ఆవిడ అంటుంది. ఈమె మాట్లాడే మాటలు మంచి నైతికతను బోధించేవిగా ఉంటాయి.

3. "ఒసేయ్! పెడతానో పెట్టనో తెలియని అన్నానికే వెంటబడుతున్నావే నువ్వు. తరతరాలుగా మా దొరల నీడన దొరల్లాగా బ్రతికిన వాళ్ళం మేము నేనెట్టాపడాలి  మా దొరల వెంట?" ఈ మాటలు వల్లడు ఒక కుక్కను చూసి అన్నాడు. వల్లడు తన దొరసానిని వెతుకుతూ వెళ్ళినపుడు మధ్యలో ఆహారం ఇచ్చి ఒకావిడ సహాయపడుతుంది. కానీ తన దొరసానిని ఇంటికి తీసుకొచ్చే వరకు భోజనం చేయకూడదని శపథం చేసుకొని ఉంటాడు వల్లడు.  తద్వారా ఆ ఆహారాన్ని ఒక చెరువు గట్టు వద్దకు తీసుకువెళ్తూ ఉంటే ఆ ఆహారం కోసం ఒక కుక్క వెంబడించినపుడు ఆ కుక్కను చూసి వల్లడు ఈ మాటలు అంటాడు. ఈ మాటలను బట్టి ఆ యజమానికి, పాలేరు వల్లడికి మధ్య ఎంత పటిష్టమైన అవినాభావ సంబంధం ఉందో తెలుస్తుంది. ఇలాంటి మాటలు ఈ నవలలో కోకొల్లలుగా ఉంటాయి.

నవల పై నా అభిప్రాయం:

నవల చాలా చిన్నది కాబట్టి సమయం వెచ్చించి చదివితే రెండు లేదా మూడు గంటల్లో పూర్తి నవలను చదవవచ్చు. కానీ వివరించాలి అంటే ఒక్కరోజైనా తక్కువే. నవలలోని ప్రతీ సన్నివేశం మన కట్టుబాట్లను ప్రతిబింబించేవిగా ఉంటాయి. పూర్వకాల సంప్రదాయాలు, ఆనాటి కట్టుబాట్లను తెలుసుకోడానికి ఒక చక్కని పుస్తకం ఇది. ఆధునిక సమాజంలో నాటి సంప్రదాయం పట్ల ఉన్న అనేక అపోహలను తొలగించేదిగా ఈ నవల ఉంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...