7, జూన్ 2023, బుధవారం

గురజాడ కథా మంజరి - స్త్రీ దిద్దిన "దిద్దుబాటు"

 "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" అని ఎలుగెత్తి చాటిన గురజాడ తెలుగు వారి పాలిట వెలుగుజాడ. సమసమాజాన్ని సంస్కరించాలనే ఉద్దేశ్యంతో ఎన్నో రచనలు చేస్తూ, కథల ద్వారా, నాటకాల ద్వారా ప్రజల్లో నూతన చైతన్యం తీసుకొచ్చిన సాహిత్య పిపాసి గురజాడ. గురజాడ పేరు వినగానే దిద్దుబాటు, మెటిల్డా, మీ పేరేమిటి, మతము విమతము, సౌదామిని, సంస్కర్త హృదయం అనే కథలు గుర్తొస్తాయి. ఈ ఆరు కథలను ఒకే చోట చదివేందుకు వీలుగా ప్రధాన సంపాదకులుగా డా. కొవ్వలి గోపాల కృష్ణ గారు, సహాయ సంపాదకులుగా ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన "వసివాడని సాహిత్యం గురజాడ కథా మంజరి" అనే పుస్తకం సాహిత్యాభిమానులకు, కథాప్రియులకు నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. గురజాడ వారి ఆరు కథలతో పాటుగా ఆ కథలపై వచ్చిన సమీక్షా వ్యాసాలను కూడా చేర్చడం ఈ పుస్తకం ప్రత్యేకత. ఈ ఆరు కథలను చదివాక వాటి గురించి మీకూ కొంత పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాశాను.

ఈ పుస్తకంలోని మూలకథలను చదివినప్పుడు అర్థం చేసుకోవడంలో నాకు కొంత ఇబ్బందిగా అనిపించినా ఆ కథలపై వచ్చిన సమీక్షా వ్యాసాలను చదివాక చాలా సులభంగా అనిపించింది. కథలను ఎలా సమీక్షించాలి? కథల ద్వారా రచయిత సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వదలచుకున్నాడు? ఏ కథను ఏ దృష్టి కోణంతో చూడాలి? అనే విషయాలను గురించి ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. 

 స్త్రీ దిద్దిన "దిద్దుబాటు"

ఇక పుస్తకంలోకి వెళ్తే... మొట్టమొదటి కథ 'దిద్దుబాటు'. తెలుగు సాహిత్యంలో తొలి కథానికగా ప్రసిద్ధి చెందిన 'దిద్దుబాటు' సమాజంలో వేశ్య వృత్తికి అలవాటుపడ్డ వ్యక్తుల ప్రవర్తనను దిద్దుబాటు చేస్తుంది. ఈ కథానిక కేవలం నాలుగు పేజీలలో అత్యంత అద్భుతంగా సమాజానికి దిశా నిర్దేశం చేస్తూ సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది. నాటి కాలంలో వేశ్యల పట్ల ధనవంతులు, విద్యావంతులు సైతం వ్యామోహం చూపే వారు. అటువంటి వేశ్యా వ్యామోహంలో పడ్డ భర్తను భార్య ఏ విధంగా సరిదిద్దిందనేదే ఈ కథానిక సారాంశం. అందుకే దీనికి "దిద్దుబాటు" అనే పేరు పెట్టారు. ఇది తొలిసారి 1910లో ఆంధ్రభారతి పత్రికలో ప్రచురించబడింది. ఇందులోని పాత్రల మధ్య సంభాషణ వాడుక భాషలోనూ, కథా కథనం సులభ గ్రాంథికంలో కనిపిస్తుంది.

ఇందులోని పాత్రలు- కమలిని,గోపాలరావు భార్యా భర్తలు. రావుడు వీరి ఇంటి పాలేరు. గోపాలరావు వేశ్యల పట్ల ఆకర్షితుడై ప్రతిరోజూ ఇంటికి ఆలస్యంగా వస్తుంటాడు. దీనిని గమనించిన కమలిని పాలేరు రావుడి సహాయంతో ఒక మంచి ఉపాయం ఆలోచించి గోపాలరావుపై ప్రయోగించి, అతడికి బుద్ధి వచ్చేట్టు చేస్తుంది.

సంక్షిప్త కథ: రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చిన గోపాల రావుకు భార్య కమలిని కనిపించదు. ఇల్లు, పడకగది అంతా వెతుకుతాడు. దీపం వెలిగించి మరీ వెతుకుతాడు. కానీ భార్య కనిపించదు. బుద్ది తక్కువ పనిచేశానని బాధపడతాడు. భార్య ఏమైందోనని పరిపరి విధాలా ఆలోచిస్తాడు. భార్య కనపడలేదన్న కోపంతో పాలేరు రావుడుపై చేయిచేసుకుంటాడు. వెంటనే తప్పుతెలుసుకుంటాడు.

      బల్లపై భార్యరాసిన ఉత్తరం కనిపిస్తుంది. ఆ ఉత్తరంలో-

'..... నా వల్లే కదా మీరు అసత్యాలు పలుకవలసి వచ్చింది. మీ త్రోవకు నేను అడ్డుగా ఉండను. ఈ రేయి కన్న వారింటికి వెళ్తున్నాను.' అని రాసి ఉంటుంది.

దాంతో గోపాలరావు ఆశ్చర్య పోయి, విద్యావతి, గుణవతి అయిన భార్య తనకు తగిన శాస్తి చేసింది అని వ్యాకులత చెందుతాడు. నౌకరికి పది రూపాయలిచ్చి కమిలినిని బతిమిలాడి తీసుక రమ్మంటాడు. 'తప్పు తెలుసుకున్నాను, ఇక ఎప్పటికీ వేశ్యల ఇంటికి వెళ్లను, రాత్రులు పూట ఇల్లు కదలను, తను లేకుండా నేను ఉండలేను' అని భార్యకు చెప్పమంటాడు.

ఇదంతా మంచం కిందనుంచి వింటున్న కమలిని తన భర్తలో వచ్చిన మార్పుకు సంతోషించి నవ్వుతూ బైటకు వస్తుంది. ఇలా కథ ముగుస్తుంది.

ఈ కథలో గురజాడ చెప్పిన కొన్ని నీతి వాక్యాలు: 

1. వేశ్యావృత్తిని నిరాకరించడం. 

2. 'శివుడు పార్వతికి సగం దేహం పంచి యిచ్చాడు కాదా, ఇంగ్లీషువాడు భార్యను బెటర్ హాఫ్ అంటాడు. అనగా పెళ్ళాం మొగుడి కన్నా దొడ్డది అన్నమాట' - రచయిత దీని ద్వారా కుటుంబంలో భార్యాభర్తలు సమానం అనే భావనను కలుగజేస్తున్నాడు. 

3. 'భగవంతుడి సృష్టిలో కల్లా ఉత్కృష్టమయిన వస్తువు విద్యనేర్చిన స్త్రీ రత్నమే....  నీ కూతుర్ని బడికి పంపుతున్నాం కదా, విద్య యొక్క విలువ నీకే బోధపడుతోంది.' అని గోపాలరావు చే చెప్పించిన ఈ మాటలు స్త్రీ చైతన్యానికి విద్యే మూలమని సూచిస్తున్నాయి.

ఈ కథలో రావుడి పాత్రద్వారా సున్నితమైన హాస్యాన్ని సృష్టించాడు గురజాడ. పాత్రలకు తగిన భాషను వాడుతూ, కథారచనలో వ్యవహారిక భాషకు పట్టం కట్టాడు. "మాతృవత్ పరదారేషు..." అని బోధించిన భారతీయ సంస్కృతిని గురజాడ గుర్తుచేస్తూ... మహిళలు అనుకుంటే ఎంతటి పెను ప్రమాదాన్నైనా దాటవచ్చని, సమ సమాజాన్ని సైతం మార్చగలిగే శక్తి భారతీయ మహిళలకు ఉంటుందనే విషయాన్ని గురజాడ ఈ కథానిక ద్వారా తెలియజేశారు.


ఇక గురజాడ కథా మంజరిలోని తర్వాతి కథ - మెటిల్డా పై క్లిక్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...