27, ఏప్రిల్ 2021, మంగళవారం

మా బాబు నవలా సమీక్ష

  ఈ కథ మొత్తం 'నేను' అని చెబుతూ కవి ఉత్తమ పురుష కథనం లో రాశాడు. ఇందులోని ఏ ఒక్క పాత్రకు పేరు ఉండదు. అన్ని పాత్రలను సంబంధాలతో కలుపుతూ రచన సాగుతుంది. ఉదాహరణకు నేను, మా పిన్నమ్మ, మా తమ్ముళ్ళు, మా బాబు మొదలైనవి.

పరిచయం:

ఈ నవల వేయిపడగలు కంటే ముందే 1935లో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణచే రచించబడింది. దీని కృతిభర్త  శ్రీ ఉయ్యూరు కుమార రాజా, ఎం ఆర్ అప్పారావు.

సంక్షిప్త కథ:

   ఒక తల్లి పిల్లవాడికి జన్మనిస్తూ మరణిస్తుంది ఆ పిల్లవాడు తన పిన తల్లి సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆ పిల్లవాడిని తక్కువ చేసి చూడటం లాంటివి చేస్తూ ఉండేవారు కానీ తన పినతల్లి మాత్రం జాగ్రత్తగా పెంచేది అయినా ఆ ఇంట్లో ఆమెకు అంత విలువ లేకపోయేది ఆ పిల్లవాడికి ఆరు ఏడు సంవత్సరాలు వచ్చేసరికి వాడి చే పాలేరు పని చేయించడం మొదలు పెట్టారు. ఈ పని భారాన్ని తట్టుకోలేక ఇల్లు విడిచి వెళ్లిపోయాడు.

   రాత్రి పగలు చాలా దూరం నడుస్తూ ప్రయాణం చేశాడు ఒక రాత్రి అడవిలో పాములు పట్టే వాళ్ళు ఈ పిల్ల వాడిని చూసి మచ్చిక చేసుకోవాలని అనుకుంటారు. కానీ వాళ్ల దగ్గర నుండి ఎలాగోలా తప్పించుకుని బయటపడి ఒక ఊరు చేరుతాడు. ఆ ఊర్లో జనాలందరూ వీడిని పాములవాడు అని నానా బాధలు పెడతారు. కానీ ఒక పెద్దాయన మాత్రం వాడిని చేరదీసి తన ఇంట్లో పెంచుకుంటాడు. అక్కడే ఈ పిల్లవాడు యువకుడు గా ఎదుగుతాడు. ఈ పిల్లవాడు ఆయనను బాబు అని పిలుస్తూ ఉండేవాడు. (ఈ విధంగా ఈ నవల శీర్షిక మా బాబు అయింది)

   కొన్ని రోజులకు ఆ పెద్దాయన ఇంటి వ్యవహారం అంతా ఈ యువకుడికి తెలుస్తుంది. యువకుడిని ఆ బాబు తన పెద్ద కొడుకు లా పెంచుతాడు కొన్ని రోజులకు ఆ పెద్దమనిషి మరణిస్తాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంది. వీరి మరణవార్త తెలిసిన ఆ పెద్దాయన యొక్క బావమరిది వీళ్ళ ఇంటికి వచ్చి తిష్ట వేస్తాడు. వాళ్ళ ఆస్తంతా కాజేసుకుంటాడు ఈ యువకుడు మాత్రం ఏమి చేయలేడు. పిల్లలకూ ఏమీ తెలియదు. కానీ ఆ బాబు వీడికి చేసిన సహాయం వల్ల ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే ఆయన రుణం తీర్చిన వాడినవుతాను. అనుకుంటాడు కానీ ఏమీ చేయలేక రోడ్డున పడతాడు.

       అక్కడి నుండి మళ్ళీ నడుస్తూ నడుస్తూ ఒక ఊరు చేరుతాడు. ఆ ఊర్లో ఒక తల్లి పరిచయమై తన అమ్మ లాగా ఆకలి తీరుస్తుంది. కానీ ఆ ఇంట్లో ఉండటం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి మళ్లీ రోడ్డున పడతాడు.

     మళ్ళీ నడుస్తూ నడుస్తూ ఒక ఊరు చేరుతాడు. అది వాళ్ళ మేనత్త గారి ఊరు. మేనమామ చనిపోవడంతో మేనత్త ఒక్కతే కష్టపడుతోంది. దానిని గ్రహించిన ఈ యువకుడు ఆ ఇంటి వ్యవహారమంతా చక్కదిద్దుతాడు. కొన్నాళ్ళు గడిచాక వాళ్ళ అత్త చనిపోతుంది. ఇప్పుడు ఆ పిల్లల బరువు బాధ్యతలు మీద పడ్డాయి. ఈ పనుల్లో చాలా బిజీగా ఉండగా ఒకరోజు బాబు కలలో కనబడి,'నా పిల్లల సంగతి ఏంటి' అనే గుర్తు చేస్తాడు. అప్పుడు ఈ యువకుడు ఆ బాబు చేసిన మేలుని గుర్తు తెచ్చుకొని, వాళ్ల ఊరికి పయనమవుతాడు.

     బాబు గారి ఊర్లో బాబు బావ మరిది బాబు కొడుకులను, కూతురునీ నానా కష్టాలు పెడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఈ యువకుడు అక్కడికి వెళ్లి వాళ్ళని చేరదీసి ఈయన వెంట తెచ్చుకుంటాడు. ఇప్పుడు బాబు గారి కొడుకులను కూతురు ని, మేనత్త కొడుకులను కూతురుని పోషించాలి. కాబట్టి వాళ్లకు చదువు చెప్పడానికి గుంటూరు పంపిస్తాడు.

     చివరికి ఆ యువకుడి మంచితనాన్ని, కష్టాన్ని గ్రహించిన ఆ పాములవాడు ఏదో ఒక సహాయం చేయాలనుకుని బాబు గారి బావమరిది అస్వస్థతకు గురయ్యేలా చేస్తాడు. ఆయన చనిపోతాడు.

  యువకుడు బాబు గారి పెద్ద కొడుకుకు తన మేనత్త కూతురును ఇచ్చి వివాహం జరిపిస్తాడు. తర్వాత బాబు గారి కూతురుని ఆ ఊర్లో ఒక రెండు రోజులు బస చేసిన పిన్నమ్మ గారి కొడుకుకు ఇచ్చి వివాహం చేస్తాడు.

    బాబు గారి కొడుకుకీ మరదలు కి పుట్టిన మగ పిల్లవాడు మళ్ళీ బాబుగా జన్మించాడని సంతోషించి, బాబు తో ఆడటం మొదలు పెట్టడంతో కథ సమాప్తం అవుతుంది.

వివిధ పాత్రల మనస్తత్వాలు (ముఖ్యమైనవి మాత్రమే):

1. నేను (ఉత్తమ పురుషలో ఉంది): 

చిన్నప్పటి నుండి నానా కష్టాలు పడుతూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని బాధలకు గురైనా బ్రతకడానికి ఏదో ఒక మార్గాన్ని వెతుక్కుంటూ పోయాడు. అందులో హింసించే వాళ్ళు కొందరు. మంచిగా చూసుకునే వాళ్ళు కొందరు. ఏ ఆధారమూ లేకుండా ఎన్నో ప్రదేశాలు మారుతూ ఎన్నో ఊళ్లు తిరుగుతూ స్థిరపడి మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావంతో వారికి ఏదో విధంగా సహాయం చేస్తూ జీవనం గడిపాడు. ఎన్ని ఆటంకాలొచ్చినా కుంగిపోకూడదు అన్న విషయాన్ని ఈ పాత్ర ద్వారా గ్రహించాలి.

2. బాబు :

ఈయన ఎంతోమందికి సహాయం చేస్తూ మంచి మనిషిగా ఎదిగిన వ్యక్తి. ఈ కథలో కథానాయకుడు ఇతడే. ఆ యువకుడిని రెండు సంవత్సరాలు మాత్రమే పోషించాడు. తన పెద్ద కొడుకులా చూసుకున్నాడు. ప్రతిఫలంగా ఆ యువకుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశాడు.

3. బాబు బామ్మర్ది: 

బాబు ఆస్తినంతా కాజేశాడు. బాబు పిల్లలతో వెట్టిచాకిరీ చేయించుకోవడం వంటివి చేశాడు చివరకు ఏమి తీసుకుపోక పాములవాడి చేతిలో మరణించాడు.

4. పాములవాడు: 

అడవిలో యువకుడిని పట్టుకున్నందుకు వాడు పాముల వాడికి బుద్ధి చెప్పాడు. తద్వారా ఆ యువకుడి పట్ల కృతజ్ఞతా భావంతో రుణపడి ఉంటాడు. ఏదోవిధంగా రుణం తీర్చుకోవాలని తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ యువకుడికి ద్రోహం చేసిన బాబు యొక్క బామ్మర్ది ను నేలపాలు చేస్తాడు. దొంగతనాలు చేసే స్థాయి నుండి సహాయ గుణం కలిగిన వ్యక్తిగా మార్పు చెందుతాడు.

5. పిన్నమ్మ:

బాబు గారి కూతురు మతిస్థిమితం లేని పిల్ల అని తెలిసి కూడా తన కొడుకుకు ఇచ్చి పెళ్లి జరిపించుకుంటుంది. ఈమెకు ఆ యువకుడి పట్ల ఎంత జాలి ఉంది అన్న విషయాన్ని ఈ సంఘటన ద్వారా కవి వర్ణించాడు.

6. కుశలమ్మ:

ఈ నవలలో పేరు ఉన్న ఏకైక పాత్ర. ఈమె ఒక ముసలావిడ. పిల్లలందరూ గుంటూరులో చదువుతున్నప్పుడు ఈమె వంట మనిషి గా ఉంటుంది. ఈమెకు సంతానం లేదు. క్రమంగా ఈమెను కూడా యువకుడే పోషించాల్సి వస్తుంది. ఇంటికి తీసుకుని వచ్చి పోషిస్తాడు.


నవలలో ఆకట్టుకునే వాక్యాలు:

1. 'రాతి లోని కప్ప కు ఆహారం ఏర్పాటు చేసే భగవంతుడు నాకు కూడా అలా చేయకుండా ఉంటాడా' ఈ వాక్యం కష్టాల పాలు అవుతున్న ఆ యువకుడికి ఆత్మస్థైర్యాన్ని నింపుకునేలా ఉంది.

2. 'ఆపదలో ఉన్నంత బుద్ధి ఆపద పోయిన తర్వాత మనుషులకు ఉండదు. మనుషులు పశువులు వాడు లేనప్పుడు గడ్డి తింటాడు తర్వాత పాయసం తిన్నాననుకుంటాడు వాడు పశువు!' ఈ మాటలు మేనత్తకు ఆ యువకుడికీ మధ్య జరిగిన సంభాషణ. మేనత్త తన కూతురికి జబ్బు చేయటంతో తిరుపతికి వస్తానని మొక్కుకుంటే  కొన్ని రోజులకు మర్చిపోతుంది.  ఒక రోజు ఆంబోతు పొడవడానికి రాగా గుర్తుకు వస్తుంది ఆ సందర్భంలో ఈ మాటలు అనుకుంటారు.

3. 'కోపం అహంకారం నుంచి పుడుతుంది అహంకారం జరుగుబాటు లోంచి కలుగుతుంది. జరుగుబాటు మూలంగా మనసుకి సుఖం అలవాటవుతుంది ఆ సుఖానికి కొంచెం వ్యతిరేకం జరగడం తోనే కోపం వస్తుంది' ఈ మాటలు యువకుడికి ఒకసారి కోపం వచ్చినప్పుడు తనలో తాను అనుకున్నాడు.

4. 'జాలి అంటే మనం కష్టపడుతున్నామని దుఖపడుతున్నామని ఎదుటి వాళ్లకు మన మీద కలిగే ఒక మెత్తని మనసు. ప్రేమ అంటే మన అందం, మన భావం లో ఉండే గుణాలు, దోషాలు అన్ని కలిసి అవతల వాళ్ళకి ఇష్టమై మన జీవితమంతా వాళ్ళ జీవితం తో కలిసి పోవాలని కలిగే ఒక మనసు.' ఈ మాటలు ఆ యువకుడు తన మరదలు ను చూసినప్పుడు తనలో తాను అనుకున్నాడు.

నవల పై నా అభిప్రాయం:

మా బాబు అని నేను మొదట విన్నప్పుడు ఏ చిన్న పిల్లవాడి గురించిన కథనో అనుకున్నాను. కానీ తెలిసిందేమిటంటే ఈ బాబు పిల్లవాడు కాదు గొప్ప సహాయ గుణం కలిగిన పెద్ద మనిషి అనీ, ఇందులోని కథానాయకుడు ఇతడేనని.

ఈ నవల చదివింప చేసే గుణం కలది. తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తి ప్రతి పేజీ చదువుతున్నప్పుడు కలిగింది. కష్టాలు కన్నీళ్ల తో మొదలైన ఈ కథ తర్వాతి పేజీలో ఇంకెంత దుఃఖం చూడాల్సి వస్తుందో అన్న అనుమానం కలిగింది. నవలలోని కొన్ని పాత్రల గురించి చదువుతుంటే ఆ కష్టాలు పగవాడికి కూడా రావద్దు అనే భావన కలిగింది. కొన్ని పాత్రల గురించి చదువుతుంటే ఆ పాత్రలను కొట్టాలనిపించేంత కోపమూ కలిగింది. మొత్తానికి నవల మొత్తము ఆనాటి సమాజాన్ని వర్ణింప చేసే విధంగా కరుణ రస ప్రాధాన్యం కలిగి ఉంది.

2 కామెంట్‌లు:

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...