9, జూన్ 2023, శుక్రవారం

గురజాడ కథా మంజరి - మతం శాస్త్రీయం కాదని నిరూపించిన కథ - " మీ పేరేమిటి? "

"మతములన్నియు మాసిపోవును - జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును" అని ఎలుగెత్తి చాటిన గురజాడ వారి కథ " మీ పేరేమిటి? " "దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా మీ పేరేమిటి?" అంటూ ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ వాక్యాన్ని బట్టే మనుషులు సృష్టించుకున్న ఎటువంటి ఆధారాలు, హేతువులు లేని రూపమే దేవుడు అని మనం అర్థం చేసుకోవచ్చు.మనకు మనం నియమానుబద్ధంగా ఉండటానికి ఒకానొక రూపాన్ని మనకంటే గొప్పదిగా భావించి, ఒక పేరు పెట్టి పూజించడమే దైవత్వం అని గురజాడ వారి భావన. ఇదే విషయాన్ని గురజాడ ఈ కథ ద్వారా తెలియజేస్తారు.

ఈ కథలో ముఖ్య పాత్రలు - శరభయ్య  శైవ మత ప్రతినిధి, మానవాళ్ళయ్య వైష్ణవ మత ప్రతినిధి, రంగాచార్యులు విష్ణుక్షేత్రం ధర్మకర్త, కృష్ణమాచార్యులు, నాంచారమ్మ  రంగాచార్యుల కొడుకు, కోడలు, పీరు సాహెబు, ఊరి మునసబు రామి నాయుడు, ఈ కథచెప్పే కథకుడు వర్తకుడు, రామ్మూర్తి బౌద్ధ మత విశ్వాసి, గురువు శాస్థుల్లు, వెంకయ్య ఉపాధ్యాయుడు. 

గురు శిష్య బృందం రామగిరిలో జరిగిన ఒక మతపరమైన సంఘటన గురించి ఒక రోజు రాత్రివేళ చర్చించుకుంటూ ఉంటారు. ఈ చర్చనే "మీ పేరేమిటి?" కథ. ఆ ఊర్లో బుద్ధుడి రూపంలో ఉన్న ఒక దేవుడి కొండని చూసిన శిష్యులు బుద్ధుడు విష్ణువు అవతారం కదా! మరి శైవులు శివలింగమని ఎలా పూజిస్తున్నారనే సందేహం వస్తుంది. దీంతో శాయన్న భక్త దీని వెనక ఈ ఊర్లో జరిగిన ఒక సంఘటన దాగి ఉందని చెబుతూ కథ ప్రారంభిస్తాడు. ఆ ఊర్లో శైవ, వైష్ణవుల మధ్య వైరం ఎక్కువగా ఉండేదని, దానికి వారు పోటీ పడేట్లు ఒకరిని మించి ఒకరు పూజలు చేసేవారని కథ ప్రారంభిస్తాడు.

ఒకరోజు శైవులు నిప్పుల గుండం తొక్కి తమ భక్తి భావాన్ని తెలియజేశారు. అదే తరహాలో వైష్ణవులు కూడా ఏమి తీసిపోరని వైష్ణవ మత ప్రతినిధి పాత్ర అయిన మానవాళ్లయ్యను నిప్పుల గుండం తొక్కించడానికి సిద్ధం చేస్తుంటారు. కానీ ఇతను తప్పించుకొదనికి ప్రయత్నిస్తుంటాడు. ఇదిలా జరుగుతుండగా నాంచారమ్మ వచ్చి ముసల్మానులు వైష్ణవులలో భాగమని చెప్పి పీరు సాహెబు చేతికి పీరును పట్టించి గుండం తొక్కిస్తుంది ఇలా శైవులకు ధీటుగా వైష్ణవులు సైతం గుండం తొక్కగలిగామని వారు భావిస్తారు. ఆ తర్వాత ఆ ఊర్లోని పీరుకు శైవ, వైష్ణవ బేధం లేకుండా పూజలు నిర్వహిస్తుంటారు. అది త్రిశూలాకారంలో ఉంది కాబట్టి శైవ పీరని శైవులు, విష్ణు నామం వలె ఉందని వైష్ణవ పీరని వైష్ణవులు చెబుతారు. ఇలా విష్ణువూ పీరుగా ఉండి, శివుడు పీరుగా ఉన్నప్పుడూ బుద్ధుడు పీరు కారాదా? అంటూ శాయన్న భుక్త కథ ముగిస్తాడు.

ఈ కథలో గురజాడ పలికించిన కొన్ని ఆణిముత్యాల్లాంటి వాక్యాలు చెప్పుకోదగ్గవి...!

"ఈ దేశంలో పాండవులు ఉండని గుహలు, సీతమ్మ స్నానమాడని గుంటలూ లేవు" - ఇది గురజాడ వారు హాస్యంగా చెప్పిన మాట. అంటే ఈ దేశంలోని జనాలు ఏ ప్రాంతాన్ని చూసినా వాటిని పాండవులకో, సీతకో ముడిపెట్టి అవి నిజమనేట్టు కథలు అల్లుతారని రచయిత చెబుతున్నారు.

"రాముడే కాదు, ఏ దేవుని మీదనైనా నిజమైన నమ్మకమన్నది యేడిస్తే ఒక్క గుండవే కాదు, అన్నీ కష్టాలూ తరించవచ్చు" - ఏ దేవుడిని పూజించినా సరే నమ్మకంతో పూజిస్తే ఎన్ని కష్టాలైనా దాటగలమనే ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది ఈ వాక్యం. విష్ణుభక్తులు శైవులలాగా అగ్ని గుండం తొక్కాలని ప్రయత్నించే సందర్భంలో గురజాడ పలికించిన మాటలివి.

"శివుదన్నా, విష్ణువన్నా, బుద్ధుడన్నా, పీరన్నా పరమాత్మ మాత్రం ఒక్కడే కదా!" - శాయన్న భుక్త కథ పూర్తి చేసిన అనంతరం రచయిత ఈ వాక్యాన్ని  పలికిస్తాడు. దీన్ని విన్నప్పుడు ఎంతమంది దేవుళ్ళను ఎన్ని రకాల పేర్లతో పిలుచుకున్నా దేవుడు మాత్రం ఒక్కడే అతడే పరమాత్మ అన్న ఆధ్యాత్మిక ప్రవచనం మనకు బోధపడుతుంది.

"అందరు దేవుళ్ళు ఒక్కరే అయితే, ఆ పీనుగుల్ని అందరినీ ఒక్కచోటే నిలిపి అందరూ కలిసి పూజ తగలెట్టరాదా?" - కథ పూర్తయిన తర్వాత అత్యంత ఆవేశంతో, మత సమాజం పట్ల నిరసనా భావంతో వెంకయ్యచే గురజాడ పలికించిన మాటలివి. అందరు దేవుళ్ళు ఒక్కరే అయినపుడు వారందరినీ ఒకే దగ్గర పూజించొచ్చు కదా! అని దీనర్థం. దేవుళ్ళందరూ ఒక్కటే కానీ వారిని పూజించే మనుషులు మాత్రం వేరువేరు ఆలోచనలతో ఉన్నారన్న కోపం ఈ మాటల్లో వ్యక్తం చేశారు గురజాడ.

ఏదేమైనా మనిషి ఆధ్యాత్మికంగా, నైతికంగా, బౌద్ధికంగా తనను తాను మలుచుకోడానికి తనకంటే గొప్పదైన భావనను కల్పన చేసుకొని పూజిస్తున్నాడని గురజాడ గారి అభిప్రాయం. ఎటువంటి హేతువులు లేని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, లేనిపోని పద్ధతులను విచక్షణా రహితంగా పాటిస్తున్నారని ఈ  కథ ద్వారా గురజాడ ఆక్షేపిస్తున్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...