28, ఏప్రిల్ 2021, బుధవారం

ప్రాచీనతను ప్రతిబింబించే సామెతలు - కనుమరుగవుతున్న పదాలు, పద్దతులు

      మన సంస్కృతీ సంప్రదాయాలకు, జీవన విధానానికి సామెతలు ప్రతిబింబాలు. ఒక్కో సామెత ఒక పేజీ వ్యాసం చెప్పలేని విషయాన్ని విపులంగా చెప్పగలదు. అట్లాగే మనం చెప్పే విషయానికి వెన్నుదన్నుగా నిల్చి మరింత స్పష్టతను చేకూర్చుతాయి సామెతలు. సామెతలు కొన్ని ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నవి.. కొన్ని మార్పులతో ప్రస్తుతం జనం నోళ్లలో నానుతూ ఉన్నవి కూడా కనిపిస్తాయి. అదుగో అటువంటివి కొన్ని సామెతలు..

1) కరణం సాధువూ కాడు - కాకి తెలుపూ కాదు

      ఈ సామెత కరణం పదవి లో ఉన్న వ్యక్తి స్వభావాన్ని గూర్చి తెలుపుతుంది.

     ఈ సామెతలో ' కరణం ' అనే పదం ఒక గ్రామ అధికారి యొక్క పదవిని తెలియజేస్తుంది. ఇది రాయలసీమ మాండలికానికి చెందినది గా పరిగణించవచ్చు. ప్రాచీన కాలం లో ఈ పదానికి సమానార్థకంగా 'రెడ్డి' , ' కర్ణం ' అనే పదాలను వాడేవారు. ఈ పదం నేటి వ్యవహారిక భాషలో కనుమరుగైనది గా చెప్పవచ్చు. దీని స్థానం లో తెలంగాణ మాండలికం లో 'పట్వారీ' , ' పోలీస్ ' , ' పటేల్ ' అనే పదాలను వాడుతున్నాము.

    ఇక్కడ సాధువు అంటే ఉత్తముడు, ఉదాత్తుడు, సన్మార్గి, సహృదయుడు, సత్ప్రవర్తకుడు గా చెప్పవచ్చు. అలాగే సాధువు అంటే సన్యాసి, ఋషి, ముని అనే అర్థాలు కూడా వస్తాయి కానీ వాటిని ఈ సామెత లో పరిగణించడం సమంజసం కాదు ఎందుకంటే ఇక్కడ కరణం పదవిలో ఉన్న వ్యక్తిని దుర్మార్గుడిగా భావించడం జరిగింది.

      ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు అంటాడు వేమన. అదే విధంగా జగమెరిగిన సత్యాలు, ఎప్పుడూ స్థిరంగా ఉండే స్వభావాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకు సూర్యుడు తూర్పున ఉదయించడం, నీరు పల్లం వైపు ప్రవహించడం మొదలైనవి. అలాగే కాకి ఎప్పటికైనా తెలుపు రంగులో కి మారుతుంది అని అనుకోవడం మూర్ఖత్వమే కదా! కాబట్టి ఇక్కడ కరణం పదవి లో ఉన్న వ్యక్తిని కాకి తో, సాధు స్వభావం కలిగిన వ్యక్తిని తెలుపు రంగు తో పోల్చడం జరిగింది. ఎలా అంటే కాకి ఎలా తెలుపు రంగులోకి మారలేదో అలాగే కరణం పదవిలో ఉన్న వ్యక్తి సన్మార్గుడు కాడని చెబుతుందీ సామెత.

    ఆధునిక కాలం లో కొందరు రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేస్తూ, ప్రజలను డబ్బులకు లొంగదీసుకొని ఓట్లు వేయించుకోవడం...గ్రామాల్లో గానీ నగరాల్లో గానీ కొందరు గూండాలు బలహీనుల ను లొంగదీసుకోవడం, లంచాలు వసూలు చేయడం వంటి వారి మారని స్వభావాన్ని ఈ సామెతకు ఉదాహరణగా చెప్పవచ్చు.

2)సింగినాదం జీలకర్ర

     సింగినాదం అనే పేరు శ్రుంగనాదం (కొమ్ము బూర) అనే పదం యొక్క రూపాంతరం. శృంగనాదం లేదా కొమ్ము బూర అంటే ప్రాచీన కాలం లో ఊర్లలో ఏవైనా కొత్త పదార్థాలు అమ్మడానికి వస్తే ఈ బూరలను ఊదుతూ సాటింపు చేసేవాళ్ళు. ఆ కాలం లో వారానికి ఒకసారి సంతలు జరుగుతుండేవి. ఆ సంతల్లో అప్పుడప్పుడు మాత్రమే జీలకర్ర అమ్మే వారు వచ్చేవారు. అలా వారు వచ్చినట్లు అందరికీ తెలియాలన్న ఉద్దేశ్యంతో శ్రుంగనాదం లేదా కొమ్ముబూర తో ఊదుతూ సాటింపు చేసేవాళ్ళు అలా శ్రుంగనాదం జీలకర్ర పేరు స్థిరపడింది అది క్రమంగా సింగినాదం జీలకర్ర గా రూపాంతరం చెందింది. కానీ ఈ పద్దతి ఆధునిక కాలంలో అంతరిచడం గమనార్హం.

     సామెత వెనక ఉన్న చరిత్రను ఒకసారి పరిశీలించినట్లయితే... 16వ శతాబ్దములో రాయలు వారు అస్తమించిన తర్వాత ఆంధ్రరాజ్యము దిక్కులేని దివాణ అయింది రాయలు అనంతరం రాజ్యము అరాచకమై చాలా అల్లకల్లోలాలు జరిగినట్లు చరిత్ర. ఆసందర్భములో తురుష్క ప్రభువులొక ప్రక్కనుండి తెలుగుభూమిని కబళించారు. అపుడు బలిష్ఠులైన కొందరు తురుష్కులు నాధుడులేని తెలుగుగడ్డమీదపడి లూఠీచేసి వస్తువాహనాలు చేజెక్కించుకుపోయేవారు. ఈ తుంటరిమూక ఊరుబయట తామువచ్చినట్లు గుర్తుకోసం వాళ్ళధర్మమా అంటూ సింగినాదం (శ్రుంగనాదం) చేస్తూండేవారు. ఆ సింగినాదం వినడమే ప్రజలకు పైప్రాణాలు పైననే పోయేవి. అపుడు జనులు మూటా, ముల్లే కట్టుకొని పారిపోయేవారు. కానీ ఈలోపనే మూకలు పైబడి ఊళ్ళు దోచుకొనేవారు.... సరిగ్గా అదేసమయంలోనే కాబూలు దేశం నుండి ఆఫ్ఘనుల మూకలు జీలకర్ర బస్తాలు వేసుకొని హిందూదేశానికి కొత్తగా దిగుమతి చేస్తూండేవారు. వాళ్ళుకూడా ఊరిబయట తమరాకకు గుర్తుగా వేరొక మాదిరి ధ్వనిగల సింగినాదం (A horn) చేస్తూండేవారు. ప్రజలు ఈ రెండువిధానాలయిన సింగినాదాలు వినడంలో తడబడే వారు. అపుడెవరో బుద్ధిమంతుడుండి ఓరినాయినలారా అదితురుక గుంపుల సింగినాదం కాదు. కాబూలువారి జీలకర్ర సింగినాదంమోయి మనం భయపడనక్కర్లేదు. అని తెలియజెప్పినమీదట ప్రజలు భయపడడం ఆపి నిర్లక్ష్యంగా నిద్రించేవారట. అప్పట్నుంచి క్రమంగా నిర్లక్ష్యార్ధంలో జీలకర్ర సింగినాదం అలవాటయిపోయిందని పెద్దలు అంటారు.

     ఆధునిక కాలంలో ఈ సామెతను నిజమో అబద్దమో తెలియని మాటలకు సింగినాదం జీలకర్ర అని కొట్టిపారేస్తుంటారు. మరియు ఎవరైనా చిన్న విషయాలకు పెద్ద గోల చేస్తే ఇది సింగినాదం జీలకర్ర గోల లాగా ఉంది అంటూ సామెతను వాడుతుంటారు.

3)దువ్వు ని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు

     దువ్వు అంటే చిరుతపులి అని అర్థం. ఈ సామెత నాచన సోమన కాలం (క్రీ. శ.1350)నాటిది. ఇక్కడ దువ్వు అనే పదం క్రమంగా పులి గా మారి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనే సామెతగా మారిపోయింది. ఈ రెండు సామెతల్లో అర్థం ఒకే విధంగా ఉన్నా, పదాలు వాడకం లో తేడాను మనం గమనించవచ్చు. కాలానుగుణంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో పదాలను మార్చడం ఈ సామెతలో గమనించవచ్చు.

     పులి చారలను చూసి నక్క పులిగా మారిపోవాలని వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి గా మారలేదు. ఇక్కడ పులిని గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తి లా, నక్కను సామాన్య స్వభావాలు కలిగిన వ్యక్తి గా భావించడం జరిగింది. పులి యొక్క భౌతిక లక్షణాలను నక్క మార్చుకున్నంత మాత్రాన పులి యొక్క మానసిక స్వభావం నక్క పొందలేదు. అంటే గొప్పవారిని చూసి అనుకరించినంత మాత్రాన సామాన్యులు గొప్పవాళ్ళు కాలేరని దీని భావం.

     ఒక గొప్ప సాధు స్వభావం కలిగిన వ్యక్తి ఎలా ఉన్నడో, ఏయే వస్త్రాలు ధరిస్తున్నాడో అవే వస్త్రాలు ఇంకో వ్యక్తి అనుసరించి అవే వస్త్రాలు ధరించడం వంటివి చేసినంత మాత్రాన ఆ వ్యక్తి మానసికంగా మాత్రం సాధు స్వభావం కలిగిన వ్యక్తి గా మారలేడు. ఇటువంటి సందర్భాల్లో ఈ సామెతను వాడటం జరుగుతుంది.

4) గానిగోనికి ఎద్దు కావద్దు చాకలోడికి గాడిద కావద్దు

     గానుగ అంటే ఒకరకమైన పురాతన కాలం నాటి యంత్రం. తైలయంత్రము, పరంజము అనేవి గానుగకు సమానార్థక పదాలు. గానుగల్లో ప్రధానంగా మూడు రకాలున్నాయి. చెరుకు గానుగ, నూనె గానుగ, సున్నం గానుగ. ఈ గానుగ యంత్రాల సహాయంతో నూనెను తీయడానికి ఆ వర్తకుడు గానుగకు ఎద్దును కట్టి కొడుతూ తిప్పుతూ ఉండేవాడు అంతే గానీ ఆ ఎద్దు యొక్క బాగోగులు గానీ దాని తిండి తిప్పలు పట్టించుకునే నాథుడే ఉండేవాడు కాదు. కానీ ఆధునిక కాలంలో ఈ గానుగలు అంతరించి పోయాయి. గానుగల్లో ఎద్దులను వాడే స్థానం లో యంత్రాలను వాడుతూ ఆధునికీకరణ చెందడం జరిగింది.

      చాకలి వారి ప్రధాన వృత్తి బట్టలు ఉతకడం మరియు అధిక బరువైన సరుకు ను ఒక చోటు నుండి మరొక చోటుకు కు మార్చడం. వీరు ఊర్లో ఉన్న అన్నీ ఇండ్లు తిరిగి బట్టలు సేకరించి వాటిని ఉతికి మళ్లీ వారి ఇళ్లకు అందించడం కోసం, సరుకు రవాణా కోసం వాహనాలు గా గాడిద లను వాడే వారు. ఇలా గాడిదలు అధిక బరువైన సరుకును చాలా సేపు మోయటం వాటికి భారంగా అనిపించేది. కానీ ఈ పద్దతి ఇప్పటి ఆధునిక కాలంలో అంతరించింది. గాడిదల స్థానం లో చాలా రకాల వాహనాలు అందుబాటులోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం.

    ఇలా గానుగ వాడి దగ్గర ఉండే ఎద్దు, చాకలి వాడి దగ్గర ఉండే గాడిద రెండూ అధిక పని భారం తో నలిగిపోయేవి. తద్వారా ఈ సామెత పుట్టుకొచ్చిందని చెప్పవచ్చు.

   వేతనం తక్కువ, పని భారం ఎక్కువగా ఉన్న కార్మికులకు ఈ సామెత వర్తించవచ్చు. కానీ నేటి అభివృద్ది చెందిన ఈ ప్రపంచంలో పై రెండు ప్రక్రియలు (గానుగల్లో ఎద్దులు వాడటం, చాకలి వారు గాడిదలు వాడటం) జరగడం లేదు కావున ఈ సామెత వాడకం తక్కువనే చెప్పాలి.


 5) కాలితో నడుస్తే కాశీకి పోగలమే కానీ తలతో నడిస్తే తల వాకిలి అయినా దాటగలమా

    రవాణా వ్యవస్థ లేని రోజుల్లో ప్రజలు చాలా మట్టుకు ప్రయాణం కాలినడకన చేసేవాళ్ళు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్నా, బంధువుల ఇళ్లకు వెళ్ళాలన్నా కాలినడకన ప్రయాణం సాగించే వారు. 

    మన తెలుగు రాష్ట్రానికి కాశీ పట్టణం చాలా దూరం లో ఉంది. ఆ కాలంలో కాశీకి వెళ్లి గంగలో స్నానమాచరిస్తే పాపాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అన్న నమ్మకం ప్రజలలో ఉంది. ఆ కాలంలో రవాణా వ్యవస్థ లేదు కాబట్టి ఈ సామెత పుట్టి ఉండొచ్చు.

    తలద్వారము, బహిర్ద్వారము, దోరణము అనే పదాలను తలవాకిలికి సమానార్థక పదాలుగా చెప్పవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మన మొదటి వాకిలి అని అనవచ్చు. తల తో నడిస్తే మన వాకిలి కూడా దాటలేము కదా!

     ప్రయాణ వ్యవస్థ లేని రోజులను దృష్టి లో పెట్టుకొని ఆలోచిస్తే నాటి ప్రజల్లో నడకతో కాశీకి అయినా వెళ్లగలమనే సంకల్పం ఉంది. నడక ప్రాధాన్యతను ఈ సామెతలో మనం గమనించవచ్చు. అదే తల తో నడుస్తే వాకిలికూడా దాటలేమని ఖచ్చితంగా చెప్పటం ఇక్కడ గమనించాల్సిన విషయం.

ముగింపు

      సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు. ఇవి ఎక్కడా వ్రాసి ఉండకపోవటంతో సామెతలలో అనేకమార్పులు వస్తాయి. ఇవి అనేక మోస్తర్లు- ఒక అంశం మరొక అంశం చేతా, సామ్యభేధాల వల్లా, వృద్ధి చేయబడీ, కొంత విడిచి వేయబడీ, ఇంకా అనేక మోస్తర్లుగా అనేక మార్పులు వస్తాయి. వాటన్నింటినీ అర్థం చేసుకొని, ఆచరణలో పెట్టడమే మన కర్తవ్యం.

    

2 కామెంట్‌లు:

  1. సరైన మార్గం లో , సరైన పద్ధతిలో , సరైన సాధనాలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు కానీ అనువు కాని వాటితో ప్రయత్నిస్తే (అంటే తలతో నడవడం లాగా) ఏమీ సాధించలేము అనిచెప్ప టానికి ఈ చివరి సామెత వాడతారు.

    రిప్లయితొలగించండి

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...