కేవలం 4 పాదాల్లో, 20 నుండి 25 అక్షరాల్లో జీవితాన్నే తెలపగలమనే సత్యాన్ని డా. ఎస్ రఘు గారి జీవనలిపి నానీల పుస్తకం రుజువు చేసింది. నావీ నీవీ వెరసి మనవిగా నిలిచిన నానీల ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. కవి తను చెప్పాలనుకున్న విస్తృతమైన భావాన్ని నాలుగు మాటల్లో ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పడమనేది నానీల ప్రక్రియలో ఉన్న ప్రత్యేకత. ఇప్పుడిప్పుడే రచనలు చేయడం నేర్చుకుంటున్న నాలాంటి వారికి ఈ పుస్తకం చక్కటి గురువు పాత్ర పోషిస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఈ పుస్తక రచయిత డా.ఎస్ రఘు గారు కవి, రచయిత, విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు. వీరు పాఠశాల ఉపాధ్యాయుడుగా, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా బాధ్యతలు నిర్వర్తించి, ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షా విభాగంలో, తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తన వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి పి.జి. స్థాయి పాఠ్యపుస్తకాల వరకు సంపాదకులుగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2023లో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులుగా ఎంపికయ్యారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల లైబ్రరీలో మొదటిసారి ఈ పుస్తకాన్ని చూసి అందులోని రెండు మూడు నానీలు చదివా.... ఇక నా కళ్ళు, నా మనసు నా మాట వినలేదు అలా ఒక పదిహేను ఇరవై నానీలు చదువుతూ.... అందులోని భావాన్ని అర్థం చేసుకుంటూ... నా జీవితంలోని అటువంటి సంఘటనలను నెమరేసుకుంటూ వెళ్ళిపోయా...! చదివిన అరగంటలో నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఆ పుస్తకాన్ని ఎలాగైనా సంపాదించాలన్న సంకల్పంతో మా తెలుగు శాఖలో అధ్యాపకులుగా పని చేస్తున్న ఈ పుస్తక రచయిత రఘు గారిని సంప్రదించి పుస్తకాన్ని సంపాదించా... ఇంకేముంది ఈ పుస్తకాన్ని గురించి ఎన్. వేణుగోపాల్ గారు "చదువరులకు రెక్కలు తొడిగే పుస్తకం" అని చెప్పినట్టు నాకూ రెక్కలొచ్చేశాయ్...! అలా ఎగురుతూ పోయా....!
ఇలా నానీల ఆకాశంలో ఎగరడం నాలో ఎంతో సంతోషాన్ని నింపింది. ఒత్తిడి కలిగినప్పుడల్లా ఒకసారి పుస్తకాన్ని తెరిచి అలా విహరించి వచ్చేస్తే... ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. ఒకసారి చదివిన నానీలను మళ్ళీ ఎన్ని సార్లు చదివినా చదివిన ప్రతీసారి ఏదో ఒక కొత్త భావన నాలో నిండినట్టు అనిపిస్తుంది. ఇలాంటి భావన మీకూ కలగాలన్న ఉద్దేశ్యంతో ఈ పుస్తకంలోని కొన్ని నానీలను మీకు పరిచయం చేస్తూ ఈ చిట్టి వ్యాసాన్ని రాస్తున్న... ఇక పుస్తకంలోకి వెళ్తే...
మన జీవితంలోని కొన్ని కొన్ని సంఘటనలను గుర్తు చేసే నానీలు ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పా కదా! ఇదిగో ఈ నానీ చూడండి...
దొంగ వర్షం
బడికెళ్లాక కురుస్తుంది!
దొంగ జ్వరం
ఇంట్లోనే వస్తుంది!
దీన్ని చదివిన వెంబడే రెండు నిమిషాలు నాలో నేనే నవ్వుకున్నా...! పాఠశాలకు అలవాటుపడుతున్న చిన్న పిల్లల మనస్తత్వాన్ని ఎంతో చమత్కారంగా ఆవిష్కరించిందీ నానీ. చిన్నప్పుడు నేను కూడా స్కూల్ కి వెళ్లాలంటే బాగా మారాం చేసేవాణ్ణి. స్కూల్ కి బయల్దేరే సమయంలో భీభత్సమైన వర్షం కురిస్తే ఎంత బాగుండో అనిపించేది...! కానీ రఘు గారు చెప్పినట్టు అది దొంగ వర్షం కాబట్టి బడికెళ్లాకనే కురిసేది. ఇక దొంగ జ్వరం సంగతి అందరికీ తెలిసిందే... బడికెళ్ళాలంటే జ్వరం వచ్చినట్టు నటించిన రోజులెన్నో..!
యవ్వనంలో అబ్బాయిలూ అమ్మాయిలూ ఆకర్షితులవడం సహజం. కొన్ని సంవత్సరాల క్రితమైతే ప్రేమ లేఖల ద్వారా ప్రేమికులు వారి వారి భావాన్ని కవితాత్మకంగా రాసి తెలుపుకునే వారు. కానీ నేటి కాలంలో యువత నేరుగా విషయాన్ని మూడు ముక్కల్లో చెప్పి ప్రేమ వలల్లో చిక్కుకుంటుంది... ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ ప్రేమ లేఖల అవసరం వచ్చిందంటూ రాసిన ఈ నానీ చూడండి...
ప్రేమికులు
పాతబడిపోయారు
ప్రేమలేఖల అవసరం
మళ్ళీ వచ్చింది!
ఇక్కడ ప్రేమికులు పాతబడటం అంటే... పాత పద్ధతులను పాటిస్తూ ప్రేమ కవిత్వం రాస్తూ వారి ప్రేమను చాటుతున్నారని అర్థం. ఇలా ప్రేమికుల మనసును ఆకట్టుకునే నానీలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి...
జ్వరాన్ని
కొలవడానికి థర్మామీటరా
నీ కరస్పర్శ
చాలదూ!
జ్వరాన్ని కొలిచే థర్మామీటరుతో ప్రేయసి కరస్పర్శను పోల్చడమనేది రచయిత విశాల హృదయానికి తార్కాణంగా చెప్పవచ్చు.
సమాజంలో కొందరు ఎలా ఉంటారంటే కోకొల్లలుగా నీతులు చెప్పినా వాటిని ఆచారణలో మాత్రం పెట్టరు. అటువంటి వారి మనస్తత్వాన్ని ఏ విధంగా తెలిపారంటే...
అతనిది
మరీ విడ్డూరం!
పుష్పవిలాపం వింటూ
పూలు కోస్తుంటాడు.
పూలు కోస్తున్నపుడు అవి పడే వేదనను కరుణశ్రీ పుష్పవిలాపం పేరుతో ఒక చక్కటి కవితా ఖండిక రచించారు. ఒక వ్యక్తి దాన్ని వింటూ పూలు కోయడమంటే... చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే! నేటి సమాజంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల గురించి చెప్పిన ఈ నానీకి తిరుగులేదంటే అతిశయోక్తి కాదనుకోండి!
కొన్ని నానీలు హాస్యాన్ని కూడా పుట్టిస్తాయి అందులో ఒకటి..
టెలిఫోన్ తీగమీద
ఒంటరి పక్షి!
మన మాటల్ని
వింటుందా!
ఈ నానీ "గోడలకు కూడా చెవులుంటాయి జాగ్రత్త!" అనే నానుడిని గుర్తు చేస్తుంది. పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, రహస్యమైన మాటలు మాట్లాడడానికి సెల్ ఫోన్ సరైన మాధ్యమం కాదని ఈ నానీ నొక్కివక్కాణిస్తుంది. అటువంటి సందర్భాల్లో నేరుగా మాట్లాడడమే శ్రేయస్కరమని తెలుపుతుంది.. నిజమే కాదా!! ఫోన్లో మాట్లాడేటప్పుడు మన మాటలు ఇక్కడి నుండి అక్కడి వరకూ పోతున్నాయంటే మధ్యలో మూడో వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారని ఎందుకనుకోకూడదు?? ఆ వ్యక్తి మన మాటలు వింటున్నాడని కూడా ఎందుకనుకోకూడదు?? ఆ మధ్యలో ఉన్న మూడో వ్యక్తిని టెలిఫోన్ తీగమీద వాలిన ఒంటరి పక్షిగా మార్చాడు... మన రచయిత.
నీతి శతకాలలో తెలిపే భావాలను సైతం నానీలు తెలియజేస్తాయని నిరూపించే నానీలూ జీవనలిపిలో కనిపిస్తాయి..
పాలలో
నీళ్లు కలిపినంత ఈజీగా
మాటల్లో
విషం నింపుతున్నాం!
శారీరకంగా దెబ్బ తగిలితే కొన్నిరోజులకది తగ్గిపోతుంది కానీ మానసికంగా కలిగిన గాయాలకు మందులేదు. మానసిక గాయాలకు కారణం ఎదుటివారి మాటలే. అంటే వాక్కుకు ఎంతటి శక్తి ఉంటుందో అర్థమౌతుంది. ఇచ్చిన లక్షల రూపాయలైనా వెనక్కు తీసుకోగలం కానీ ఆడిన మాట వెనక్కు తీసుకోలేమనే నానుడి ఈ నానీ ను సమర్థిస్తుందని చెప్పవచ్చు. ఆధునిక సమాజంలో రకరకాల మాధ్యమాల కారణంగా మన మాటలు కలుషితం అవుతున్నాయి. ధనం లేకపోయినా సరే, కానీ మాట్లాడే మాటలు తీయగా ఉంటే మనసుల్ని ఆకట్టుకుంటాయి. కాబట్టి అటువంటి మాటల్లో విషం కలిపితే ఎదుటివారు మనకు శత్రువులుగా మారిపోతారు. ఇక్కడ మాటలు కలుషితం అవ్వడాన్ని పాలల్లో నీళ్లు కలపడం అనే దానితో ఉపమానం వేసి ఇంతటి విశాలమైన అర్థాన్ని నాలుగుముక్కల్లో చెప్పారు రచయిత.
ఆధునిక కాలంలోని యువతకు తినడానికి తిండిలేకున్నా బ్రతకగలుగుతున్నారేమో కానీ సెల్ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేక పోతున్నారు..
సెల్ ఫోన్
మ్రోగింది
ఏకాంతపు గుండెల్లో
ముల్లు గుచ్చుకుంది!
వారానికి మూడుగంటల కంటే అధికంగా ఫోన్ మాట్లాడితే రక్తపోటు సమస్య వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. గంటల తరబడి ఫోన్లో మాట్లాడటం ఒక సరదా అయిపోయింది... ఒంటరిగా ఉన్నపుడు పుస్తకాలను స్నేహితులుగా మార్చుకోవాల్సిన యువత సెల్ ఫోన్ ను స్నేహితుడిగా మార్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీన్ని చదివినప్పుడు నా ఏకాంతపు గుండెల్లో కూడా ముల్లు గుచ్చుకుంది... దాన్ని తీయడానికి పుస్తకాన్ని మొత్తం చదివేశా...!
దీన దళిత దుఃఖితుల జీవనాన్ని తెలిపే నానీలూ ఇందులో ఉన్నాయి. ఇది చూడండి..
దారిద్ర్యం కూడా
ఒక ఆల్కేమీ
దాని రహస్యం
ఒక్క పేదవాడికే తెలుసు!
కవిత్వం ఒక ఆల్కేమీ దాని రహస్యం ఒక్క కవికే తెలుసు అన్న తిలక్ గారి ఆలోచనలతో దారిద్రాన్ని సైతం ఆల్కేమీగా మలిచి, పేదవాడికే అందులోని కష్టాలు, బాధలు, తెలుస్తాయి. పేదవారే అందులోని రహస్యాలను అర్థం చేసుకోగలుగుతారు... కష్టాలను గురించి మాటల ద్వారా ఎంత చెప్పినా వృధానే కాబట్టి ప్రత్యక్షంగా అనుభవిస్తేనే తెలిసొస్తుందనే భావనతో రాసిన ఈ నానీ పేదవాడి గుండెలను హత్తుకుంటుంది.
ఎవరి జీవితంలో అయినా రెండు విభాగలుంటాయి. ఒకటి పెళ్లికి ముందు.. మరొకటి పెళ్లికి తర్వాత.. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో నాలుగు మాటల్లో చెప్పిన ఈ నానీ చూడండి...
శుభలేఖలో
ఏదో అచ్చుతప్పు
సర్దుకుపోవడం
అక్కడ్నుంచే మొదలు!
బ్యాచిలర్ జీవితంలో వివాహానికి ముందు ఎంతో స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరుగుతూ... ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు.. ఒక్కసారి వివాహం అయిందంటే బరువు బాధ్యతలు తలపై వచ్చి పడతాయి... బాధ్యతగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో పాటు కొన్ని కొన్ని విషయాలు నచ్చకపోయినా సర్దుకుపోవాల్సిన సంఘటనలు ఎదురౌతాయి. అలా సర్దుకుపోవడం అనేది వివాహ శుభలేఖలో పడ్డ అచ్చుతప్పుతోనే మొదలౌతుందని రచయిత చాలా చమత్కారంగా తెలిపారు.
ఇలా ఇంకెన్ని నానీలను పరిచయం చేసినా తక్కువే... దాన్ని మీరూ చదివితేనే అనుభవించగలుగుతారు.
పుస్తకాలకు
రెక్కలుండవు
చదివితే
మనకు పుట్టుకొస్తాయి
అని రచయిత చెప్పినట్టు... చదివితే తప్ప రెక్కలు పుట్టవు... ఒక్కసారి చదవడం మొదలెట్టామంటే అలా నానీల ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతాం. మీరూ రెక్కలు తొడుక్కోవాలనుకుంటున్నారా అయితే మా గురువు గారి జీవనలిపి నానీలు చదవాల్సిందే....!
~~మ్యాడం అభిలాష్